మక్కకు మద్దతు కరువు | - | Sakshi
Sakshi News home page

మక్కకు మద్దతు కరువు

Mar 10 2026 12:48 PM | Updated on Mar 10 2026 12:48 PM

● ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ● ప్రైవేట్‌ మార్కెట్‌లో రూ.1,600 మాత్రమే ● పంట సీజన్‌ ప్రారంభమవుతున్నా కొనుగోళ్లపై స్పష్టతనివ్వని ప్రభుత్వం ● ఆందోళనలో మొక్కజొన్న రైతులు

రైతుల్లో ఆందోళన

ప్రభుత్వ నిర్ణయం మేరకు కొనుగోళ్లు

● ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ● ప్రైవేట్‌ మార్కెట్‌లో రూ.1,600 మాత్రమే ● పంట సీజన్‌ ప్రారంభమవుతున్నా కొనుగోళ్లపై స్పష్టతనివ్వని ప్రభుత్వం ● ఆందోళనలో మొక్కజొన్న రైతులు

ఖమంవ్యవసాయం: యాసంగిలో మునుపెన్నడూ లేనంతగా మొక్కజొన్న సాగు చేయడంతో పంట ఉత్పత్తికి కనీస మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రైవేట్‌ మార్కెట్‌లో మక్కల ధర క్వింటాలుకు రూ.1,600కు మించి పెట్టడం లేదు. యాసంగిలో సాగు చేసిన మక్క పంట చేతికందే దశకు చేరగా.. అక్కడక్కడా ముందస్తుగా సాగు చేసిన పంట కోతలు సాగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలం కూడా ఉండటంతో యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కనీస మద్దతు ధర దక్కడం లేదు. సాధారణంగా యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న పంట ఏప్రిల్‌ ఆరంభం నుంచి చేతికందుతుంది. కానీ, ఈసారి పత్తిని తొలగించిన కొందరు ముందస్తుగా పంట సాగు చేయటంతో మార్చి రెండు, మూడు వారాల నుంచి పంట చేతికందే అవకాశాలు ఉన్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో

2.40 లక్షల ఎకరాల్లో..

వానాకాలంలో సాగు చేసిన పత్తి అధిక వర్షాలకు దెబ్బతినటంతో దానిని తొలగించి, మొక్కజొన్న సాగు చేశారు. జలాశయాల్లో నీరు ఉండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,40,222 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో 1,67,282 ఎకరాల్లో, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 72,940 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. కాగా, సాగు విస్తీర్ణం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6,24,577 టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా (ఎకరాకు సుమారు 26 క్వింటాళ్లు) వేసింది. కానీ, పంట దిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్లు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు చేసిన విస్తీర్ణం నుంచి 4,34,933 టన్నులు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సాగు చేసిన పంట నుంచి 1,89,644 టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు..

యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. పలుచోట్ల పంట కోతలు ప్రారంభమై ప్రైవేట్‌ మార్కెట్‌లో విక్రయాలు కూడా సాగుతుండగా.. గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,600కు మించి ధర పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400గా నిర్ణయించగా.. వ్యాపారులు మాత్రం క్వింటాలుకు రూ.800 ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కోతలు ముమ్మరం కానుండగా, పంట కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకుండాపోయింది. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించాలని రైతులు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ముందుకు వచ్చినా నిబంధనల ఆధారంగా 30 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో దిగుబడి ఆధారంగా ఖమ్మం జిల్లాలో 1,30,500 టన్నులు, భదాద్రి కొత్తగూడెంజిల్లాలో56,900 టన్నులు మాత్ర మే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది.

పైవేట్‌ మార్కెట్‌లో మొక్కజొన్న ధర దయనీయంగా ఉండటం, ప్రభుత్వం పంట కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోతలు ప్రారంభమవుతుండటంతో ఇదే అదనుగా వ్యాపారులు పంటకు డిమాండ్‌ లేదనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మొక్కజొన్నల కొనుగోళ్లపై ఇంకా అనుమతులు రాలేదు. ప్రభుత్వం అనుమతిస్తే మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర శాఖ చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్‌ నుంచి యాసంగి మొక్కజొన్నల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుంటాయి. యాసంగిలో కొందరు ముందస్తుగా సాగు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట కొనుగోళ్లు ఉంటాయి. – సునీత, మేనేజర్‌,

మార్క్‌ఫెడ్‌ ఉమ్మడి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement