ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల పరిధి భూదాన్ భూమిలో ఇటీవల నిర్మాణాలు కూల్చివేసిన చోట శిథిలాల తొలగింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో కార్మికుల ద్వారా గోడలు, ఇటుకలను తరలిస్తున్నారు. ఈ శిథిలాలను సమీపంలోని గురుకుల పాఠశాల వెనకాల భారీ గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. గత నెల 24న భూదాన్ భూమిలో కూల్చివేతలు చేపట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఇక్కడి నిర్వాసితులకు అంబేద్కర్ భవన్, పక్కనే ఉన్న టీటీడీసీలో ఆశ్రయం కల్పించగా వందలాది మంది ఇరుకు హాళ్లలో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
ప్లాట్ల పంపిణీ కోసమేనా...
నిర్మాణాలు కూల్చివేసిన చోటే అర్హులుగా గుర్తించిన సుమారు 300మందికి 110 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. అంతేకాక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు పట్టాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసినా స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, ఒకటి, రెండు రోజుల్లో అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతోనే భూమి చదును చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అర్హులకు అక్కడే పట్టాలు, ఇళ్లు?


