ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్ తెల్లాపూర్‌లో ఈనెల 8వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారులు సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని ఆర్చరీ ఖేలో ఇండియా సెంటర్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు కె.నాన్సిరేనా, ఎం.శరణ్య, మనస్విని, బాలురలో బి.అభయ్ నాయక్ అండర్–10 ఇండియాన్ రౌండ్‌లో, జి.జువాన్‌సాయి అండర్–13లో, రికర్వులో టి.వెంకటయోగేశ్వర్ అండర్–15 విభాగం నుంచి ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈనెల 26నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాధుల సారంగాణి, పుట్టా శంకరయ్య, కోచ్ నగేష్ అభినందించారు.
‘చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత కరువు’
వైరా: స్థానిక సంస్థల పరిపాలనలో మహిళలకు కల్పించిన ప్రాధాన్యత చట్టసభలలో ఇవ్వడం లేదని ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, జిల్లా అధ్యక్షురాలు మేరుగు రమణ అన్నారు. తెలంగాణ రైతు సంఘం, ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యాన సోమవారం వైరాలో నిర్వహించిన శ్రామిక మహిళా దినోత్సవంలో వారు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం శ్రామిక మహిళా దినోత్సవానికి కారణమైన త్యాగాల చరిత్రను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నాయకులు బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మల్లెంపాటి వీరభద్రం, సుంకర సుధాకర్, ఎం.రామారావు, బొంతు సమత, తోట కృష్ణవేణి పాల్గొన్నారు.
సాధికారత సాధించాలి
సత్తుపల్లిరూరల్: హక్కులను కాపాడకుంటూ సమాన పనికి సమాన వేతనంతో మహిళా సాధికారత సాధించాలని ఐద్వా రాష్ట్ర కోశాధి కారి మాచర్ల భారతి పిలుపునిచ్చారు. సత్తుపల్లి లో చెరుకు రత్నకుమారి అధ్యక్షతన జరిగిన ఆమె, డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి మాట్లాడారు. నాయకులు పి.ఝాన్సీ, జ్యోతి, నాగమణి, రుద్రమలత, కృష్ణవేణి, శీలం కోటేశ్వరి, సత్యనారాయణరెడ్డి, జాజిరి శ్రీను, టి.కృష్ణార్జున్‌రావు, సత్యం, భాస్కర్, లత, లక్ష్మి, నాగమణి, కోటేశ్వరి పాల్గొన్నారు.
‘పీఎంశ్రీ స్కూళ్ల అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?’
ఖమ్మంమయూరిసెంటర్: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పీఎంశ్రీ స్కూళ్ల అభివృద్ధి, పర్యవేక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. సోమవారం ప్రారంభమైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పీఎం శ్రీ పాఠశాలల్లో కంప్యూటర్, ఐసీటీ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసి క్రీడా సదుపాయాలు, వృత్తి విద్య, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 91 శాతం అమలు సాధించగా ఉపాధ్యాయులకు శిక్షణ, పాఠశాలలకు కిట్లు అందజేసినట్లు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు 502మంది గైర్హాజరు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈమేరకు సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లాలోని 18,351మంది విద్యార్థులకు 17,849మంది హాజరుకాగా, 502మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఓ సెంటర్‌లో కాపీయింగ్‌కు పాల్ప డుతున్న విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
పూర్వ విద్యార్థుల
పెద్దమనస్సు!
రూ.1.70 లక్షలతో గ్రంథాలయం ఏర్పాటు
నేలకొండపల్లి: చదివిన పాఠశాలకు తమ వంతు చేయూత ఇవ్వాలని నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థులు కలిసి గ్రంథాలయమే ఏర్పాటుచేశారు. నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1989 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు 70 మంది జట్టుగా ఏర్పడి రూ.1.70 లక్షలు సేకరించారు. ఈ నిధులతో 2,500 పుస్తకాలతో భక్తరామదాసు స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. లైబ్రరీని డీఈఓ చైతన్య జైనీ మంగళవారం ప్రారంభిస్తారని హెచ్‌ఎం గోపగాని రమేష్ తెలిపారు.


