సీపీఐ శతాబ్ది సభ.. అందరి పండుగ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు సబ్బండ వర్గాల సంబురమని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. ఈనెల 18న పార్టీ శతాబ్ది ఉత్సవాల సభ జరగనున్న నేపథ్యాన మంగళవారం ఖమ్మం బైపాస్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద ఎర్ర బెలూన్లకు సీపీఐ జెండాలు కట్టి గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పార్టీ పని చేస్తోందన్నారు. తద్వారా దున్నే వానికి భూమి, బ్యాంకుల జాతీయీకరణ జరిగిందని, శ్రమ దోపిడీ నుంచి కార్మికులకు విముక్తి కలిగినా మళ్లీ మతోన్మాద శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన సమరశీల పోరాటాలకు ప్రజలను సంసిద్ధులను చేసేందుకే శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి, మేకల శ్రీనివాసరావు, ఏనుగు గాంధీ, బిజి.క్లెమెంట్, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, శతాబ్ది ఉత్సవాల సభ ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ట్రాక్టర్ ర్యాలీ ఖమ్మం సీపీఐ కార్యాలయం నుంచి బైపాస్ రోడ్డు, బస్‌డిపో, మయూరిసెంటర్, వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్, ఎన్టీఆర్ విగ్రహం, బైపాస్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు మాట్లాడగా నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, బానోత్ రాంకోటి, బాగం ప్రసాద్, ఏలూరి భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ జాతీయ సమితి సభ్యులు
బాగం హేమంతరావు
సీపీఐ శతాబ్ది సభ.. అందరి పండుగ


