ఇప్పటికై నా మిస్టరీ వీడేనా ?
● సీపీఎం నేత రామారావు హత్య కేసు విచారణలో మరో అడుగు ● 24మందికి టెలిగ్రాఫ్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ● అంగీకరించి బెంగళూరు వెళ్లిన ఆరుగురు కాంగ్రెస్ నాయకులు
చింతకాని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసు మిస్టరీ ఇప్పటికై నా వీడుతుందా.. దర్యాప్తు ఇంకొన్నాళ్లు సాగుతుందా అన్న చర్చ మొదలైంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన ఆయనను ఇంట్లోనే గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన గుర్తు తెలియని దుండగులు కత్తులతో అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది జరిగి 75రోజులు కావొస్తుండగా.. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో సహా మొత్తం 30మంది పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా పురోగతి కానరాలేదు. ఈ నేపథ్యాన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, అనుమానితులు, సాక్షులు, కుటుంబసభ్యులతో సహా మొత్తం 24 మందికి పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ ఖమ్మం మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు.
కోర్టు నుంచి నోటీసులు
గతనెల మొదటి వారంలో పోలీసులు పిటీషన్ దాఖలు చేయగా పాలిగ్రాఫ్ పరీక్షకు హాజరయ్యేందుకు సమ్మతి తెలియజేయాలని 24 మందికి ఈనెల 5వ తేదీన కోర్టు నుంచి నోటీసులు జారీ చేశారు. ఇందులో రామారావు కుటుంబసభ్యులు నలుగురితో పాటు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరిలో కుటుంబ సభ్యులు సహా మరో వ్యక్తి కోర్టు నోటీసులు తీసుకోలేదు. ఇక నోటీసులు తీసుకున్న 19మంది జనవరి 7వ తేదీన కోర్టుకు హాజరైనా ఆరుగురు కాంగ్రెస్ నాయకులు పాలిగ్రాఫ్ పరీక్షకు అంగీకరించారు.
బెంగళూరుకు ఆరుగురు...
పాలిగ్రాఫ్ పరీక్షా కేంద్రం హైదరాబాద్‌లో లేకపోవడంతో బెంగళూరులోని కేంద్రానికి రావాలని కాంగ్రెస్ నాయకులు ఆరుగురికి సూచించగా సోమవారం బయలుదేరారు. వీరికి మంగళవారం నుంచి పాలిగ్రాఫ్ పరీక్షలు మొదలుపెట్టగా రోజుకు ఇద్దరు చొప్పున పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రామారావు హత్య జరిగిన రోజు ఆయన భార్య స్వరాజ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రామానికి చెందిన బొర్రా ప్రసాద్‌రావు, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కంచుమర్తి రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. పాలిగ్రాఫ్ పరీక్షకు బెంగళూరు వెళ్లిన వారిలో కేసు నమోదైన ఐదుగురితో పాటు గ్రామానికే చెందిన గుగ్గిళ్ల రాధాకృష్ణ ఉన్నారు. ఈ పరీక్ష తర్వాత దర్యాప్తులో అడుగు ముందుకు పడుతుందా, లేదా అనేది తేలనుంది.


