సీఎం టూర్‌.. ఖరారు | - | Sakshi
Sakshi News home page

సీఎం టూర్‌.. ఖరారు

Jan 13 2026 6:10 AM | Updated on Jan 13 2026 6:10 AM

సీఎం టూర్‌.. ఖరారు

సీఎం టూర్‌.. ఖరారు

సీపీఐ శతజయంతి ఉత్సవాలకు..

పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు ప్రత్యేక అతిథిగా హాజరు

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యాన సీఎం పర్యటనకు ప్రాధాన్యత

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ఆయన... అదేరోజు మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిసింది. అంతేకాక ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమావేశమై మున్సిపల్‌ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇందులో సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభ, పాలేరు నియోజవర్గంలో సీఎం పర్యటన ఖరారైనా, ఉమ్మడి జిల్లా నేతల భేటీపై స్పష్టత రావాల్సి ఉంది.

ముందుగానే ఒక విడత..

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలైంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందన్న ప్రచారం నేపథ్యాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే పర్యటనలు చేపట్టాలనే భావనతో ఈనెల 16న ఆదిలాబాద్‌లో సీఎం ప్రచారపర్వం మొదలుకానుంది. ఇక ఈనెల 18న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జరగనున్నందున ఆ సభకు హాజరుకావడంతో పాలేరు నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక విడత సీఎం ప్రచారం చేసినట్లవుతుందనే భావనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం.

పాలేరులో శంకుస్థాపనలు

జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి 18వ తేదీన పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, 100 పడకల ఆస్పత్రి నిర్మాణాలకు శంకుస్థాపన చేశాక మద్దులపల్లి మార్కెట్‌ను ప్రారంభిస్తారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉండడంతో సీఎం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, వైరా, మధిర, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పర్యటనలో ఉమ్మడి జిల్లా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమవుతారని తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోగా, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని ముఖ్యనేతలకు సీఎం సూచిస్తారని సమాచారం. అయితే, ఈ సమావేశానికి సంబంధించి జిల్లా నేతలకు ఇప్పటివరకైతే అధికారిక సమాచారం అందలేదని తెలిసింది.

సీపీఐ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ బాధ్యులు ఉత్సవాల ముగింపు సందర్భంగాఈనెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రముఖులు హాజరవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ కలిసి పోటీ చేసినందున సీఎం రేవంత్‌రెడ్డిని సైతం సీపీఐ నేతలు ఆహ్వానించారు. దీంతో ఆయన సుముఖత తెలపడంతో సీఎం జిల్లా పర్యటన ఖరారైంది.

ఈనెల 18న ఖమ్మంకు రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement