విచ్చలవిడిగా మందులతో ముప్పు
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● శాటిలైట్ ద్వారా పంటల తెగుళ్ల గుర్తింపు మొదలు
రఘునాథపాలెం: పురుగు మందులు, రసాయన ఎరువుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతినడమే కాక ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఓ రైతుగా యూరియా, పురుగుమందుల అధిక వినియోగానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో రైతులకు డ్రోన్ పరిజ్ఞానంపై సోమవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఎరువులు, పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతున్న నేపథ్యాన ప్రతీ రైతు మట్టి పరీక్షలు చేయించి అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. ఇదే సమయాన సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని తెలిపారు. కాగా, శాటిలైట్ ద్వారా పంటల్లో తెగుళ్లను గుర్తించే ప్రక్రియ కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని, ఆతర్వాత రాష్ట్రమంతా మట్టి ఆరోగ్యాన్ని నమోదు చేసే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక డ్రోన్ల వినియోగంతో అవసరమైన చోట, అవసరమైన మేరకే పురుగు మందులు చల్లడం వల్ల ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో కూడా సాంకేతికత ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రఘునాథపాలెం మండలం రాములు తండా వద్ద రూ.2.50 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పాల్గొనగా మంత్రి మాట్లాడుతూ ఏకగ్రీవంగా పాలకవర్గాలు ఎన్నికై న గ్రామాలకు రూ.10 లక్షల గ్రాంట్ అందిస్తామని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పుల్లయ్య, మధుసూదన్, ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు దిరిశాల వెంకటేశ్వర్లు, ప్రియాంక, బానోతు వెంకట్రాం, సాధు రమేష్‌రెడ్డి, తాతా రఘురాం, మందడపు సుధాకర్, తుపాకుల యలగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.


