జిల్లాలో 9,844 మె.టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. అన్ని మండలాల్లో రైతులకు యూరియా సాఫీగా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నందున రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.
వేగంగా బౌద్ధక్షేత్రం
అభివృద్ధి పనులు
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రంలో అభివృద్ధి పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా వేగంగా చేపడుతున్నట్లు పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ తెలిపారు. బౌద్ధక్షేత్రం వద్ద జరుగుతున్న పనులు, ఇటీవల బయటపడిన పురాతనకాలం నాటి మట్టి కుండను పరిశీలించాక ఆయన మాట్లాడారు. క్షేత్రం వద్ద తవ్వకాల్లో లభించే సామగ్రిని భద్రపరుస్తుండగా, అభివృద్ధి పనుల సమయాన ఆనవాళ్లకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్మాణాలు ఆనాటి రూపంలోనే చేపట్టేలా నిపుణుల సలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లునర్సింగ్ నాయర్, శంకర్‌తో పాటు స్థానికులు పసుమర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మామిడి రైతులకు
రాయితీపై కవర్లు
ఖమ్మంవ్యవసాయం: మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు పండ్ల నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకునేలా రాష్ట్రప్రభుత్వం 50శాతం రాయితీపై కవర్లు అందిస్తోందని జిల్లా ఉద్యానాధికారి ఎంవీ.మధుసూదన్ తెలిపారు. తెగుళ్లు సోకి కాయలు పాడు కాకుండా, పక్షులు, కోతుల రక్షించుకునేలా ఈ కవర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒక కవర్ ధర రూ. 2.50లు కాగా రాయితీపై రూ.1.25కు ప్రభుత్వం అందిస్తుందని, ఎకరాకు 8వేల కవర్ల చొప్పున గరిష్టంగా ఐదెకరాలకు వరకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఉద్యానవన అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలేరు నియోజవర్గ రైతులు 89777 14104 నంబర్‌లో, ఖమ్మం నియోజకవర్గంతో పాటు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల రైతులు 89777 14103లో, మధిర నియోజకవర్గ రైతులు 89777 1413, వైరా నియోజకవర్గంతో పాటు సత్తుపల్లి, వేంసూరు మండలాల రైతులు 89777 14114 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
వైభవంగా
శ్రీనివాస కళ్యాణం
వేంసూరు: సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు జరిపించారు. వేంసూరు మండలం గూడురు దాసాంజనేయ స్వామి ఆలయ ప్రాగణంలో సోమవారం తాతా మోహన్‌రావు ఆధ్వర్యాన ఈ కల్యాణ వేడుక నిర్వహించారు. తొలుత గ్రామ దేవతలకు 108 బిందెల జలాలతో అభిషేకం చేశారు. అనంతరం టీటీడీ అర్చకులు పరుచూరి మాదావచార్యులు, వ్యాఖ్యాత శ్రీమన్నారాయణ ప్రసాదాచార్యుల ఆధ్వర్యాన స్వామి కల్యాణం జరిపించారు. సీఐ లక్ష్మణరావుతో పాటు సరిత, చెన్నారావు, అశోక్, యేలాద్రి, అయ్యదేవర సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్‌కు సెలవులు
ఖమ్మంవ్యవసాయం: సంక్రాంతి పండుగ, వారాంతం సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు ప్రకటించారు. ఈనెల 14న బుధవారం భోగి, 15న గురువారం మకర సంక్రాంతి, 16న శుక్రవారం కనుమతో పాటు 17న శనివారం, 18న ఆదివారం వారాంతపు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 19వ తేదీ సోమవారం నుంచి పంటల క్రయవిక్రయాలు జరుగుతాయని మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 9,844 మె.టన్నుల యూరియా


