గ్రీన్‌ఫీల్డ్ హైవేపై సవారీ
సంక్రాంతి వేళ దూసుకెళ్తున్న వాహనాలు
వైరా నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వరకు అనుమతి
వైరా: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ఇంకొన్ని చోట్ల పెండింగ్ ఉన్నా చాలా ప్రాంతాల్లో మాత్రం రహదారి సిద్ధమైంది. ఈనేపథ్యాన హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న ఏపీ వాసులు పలువురు ఈ రహదారిని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా వాహనాలు ఖమ్మం మీదుగా మళ్లిస్తుండడంతో వైరా సమీపాన సోమవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి చేరుకుంటున్నారు. వైరా నుండి జంగారెడ్డిగూడెం వరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వాహనాలను అనుమతిస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నారు.
162.10 కి.మీ. నిడివితో నిర్మాణం
ఖమ్మం నుంచి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వరకు యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్నారు. ఈ హైవే పొడవు 162.10 కి.మీ. కాగా, ఖమ్మం జిల్లాలో సుమారు 105 కి.మీ. ఉంది. అయితే, ఖమ్మం సమీపాన మున్నేటిపై వంతెన, ధంసలాపురం వద్ద రైల్వేలైన్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతాచోట్ల రహదారి, డివైడర్ల నిర్మాణం పూర్తికావడంతో ఇతర పనులను కూడా త్వరగా పూర్తిచేసి ఒకటి, రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
రద్దీ కారణంగా మళ్లింపు
ఏపీలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునే అక్కడి ప్రజలు హైదరాబాద్ నుంచి వేలాదిగా బయలుదేరారు. ఈనేపథ్యాన సూర్యాపేట మీదుగా వెళ్లే రహదారిపై రద్దీ పెరగడంతో అక్కడి పోలీసులు ఏపీలోని పలు ప్రాంతాల వారికి ఖమ్మం మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో సూర్యాపేట మీదుగా ఖమ్మం చేరుకుంటున్న వాహనదారులు బైపాస్ పైనుంచి వైరాకు చేరుకుని మండలంలోని సోమవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేకి చేరుతున్నారు. గత మూడు రోజులుగా భారీసంఖ్యలో వాహనాలు గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు వెళ్తున్నాయి. హైవే అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో టోల్ గేట్లు కూడా లేనందున ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి.


