రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు
మోడల్‌గా ఏదులాపురం
● మీటర్ గ్యాప్ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం అర్బన్: పాలేరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఖమ్మం కార్పొరేషన్ విద్యానగర్ కాలనీ అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.12 కోట్ల నిధులు మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంకా అవసరమైన నిధులు మంజూరు చేసి మీటర్ ఖాళీ లేకుండా సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యానగర్ కాలనీలో రూ.4 కోట్ల నిధులతో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పడి పదేళ్లు దాటినా గత పాలకులు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, ఆర్డీఓ జి.నరసింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ డి.సైదులు, నాయకులు మద్దినేని బేబీస్వర్ణకుమారి పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెంలో రూ.42.26 కోట్లు, పెదతండాలో రూ.14కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ అభివృద్ధి పనులపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు బండి జగదీష్, తోట చినవెంకటరెడ్డి, చింతమళ్ల రవికుమార్, బండి సతీష్, వెంపటి రవి, ధరావత్ రాంమ్మూర్తినాయక్, మల్లారెడ్డి పాల్గొన్నారు.


