నమ్మకం పేరిట నయవంచన | - | Sakshi
Sakshi News home page

నమ్మకం పేరిట నయవంచన

Jan 11 2026 7:50 AM | Updated on Jan 11 2026 11:09 AM

నమ్మకం పేరిట నయవంచన

నమ్మకం పేరిట నయవంచన

భర్తకు దూరమైన మహిళకు

అండగా ఉంటానని భరోసా

ఆపై లొంగతీసుకునే యత్నం ఫలించక దారుణహత్య

నిందితుడికి సహకరించిన రౌడీషీటర్‌

ఖమ్మంక్రైం: భర్తకు దూరమైన మహిళకు సోదరుడిలా అండగా ఉంటానని నమ్మంచి.. సాయం చేస్తున్నట్లు నటించాడు. ఆ వ్యక్తి అసలు స్వరూపం తెలియక ఆయన వ్యాపారం కోసమంటూ సదరు మహిళ డబ్బు, బంగారం ఇవ్వడమే కాక మరికొందరి నుంచి అప్పులు ఇప్పించింది. ఆపై ఆయనలో మృగం మేల్కొనడంతో ఇది తప్పు అని వారించినా వినకపోగా ఊరు మారినా విడవకుండా మరో వ్యక్తితో కలిసి దారుణంగా హతమార్చాడు. ఖమ్మంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

భర్తతో విభేదాలు సృష్టించి..

కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన ప్రమీల (35) తల్లిదండ్రులు మృతి చెందటంతో భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం రేగళ్లలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంది. అదే ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ మాడెం నరసింహారావుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2010లో వివాహం చేసుకుని పాల్వంచలో నివాసం ఉన్నారు. అక్కడ నరసింహారావు స్నేహితుడైన బొమ్మ శ్రావణ్‌ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయనను ప్రమీల అన్నయ్య అని పిలిచేది. కొంతకాలానికి నరసింహారావు దంపతుల మధ్య విబేధాలు రాగా ఇందుకు శ్రావణే కారణమని తెలిసింది. ఆపై ప్రమీల భద్రాచలంలో ఇల్లు అద్దెకు తీసుకుని బట్టల దుకాణంలో పనిచేసేది. అక్కడకు వెళ్లే శ్రావణ్‌ సోదరుడిలా అండగా ఉంటానని నమ్మించడంతో ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బుతో పాటు మరికొందరి దగ్గర అప్పు ఇప్పించింది. ఆ తర్వాత ప్రమీలపై కన్నేసిన ఆయన దంపతుల మధ్య అగాధం మరింత పెంచడంతో ఆమె మార్పును కనిపెట్టి హెచ్చరించింది. ఆపై భద్రాచలంలో పోలీస్‌స్టేషన్‌లో శ్రావణ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రమీల భద్రాచలం నుంచి పండితాపురంలోని బాబాయి, పిన్ని వద్దకు, అనంతరం ఖమ్మం వచ్చి కస్బాబజార్‌లోని షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తూ వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. ఆమైపె కక్ష పెంచుకున్న శ్రవణ్‌ తన బావమరిది, కొత్తగూడెంలోని రామవరం వాసి, రౌడీషీటర్‌ అయిన రమేశ్‌తో శుక్రవారం ఖమ్మం వచ్చాడు. రాత్రి ఆమె షాపింగ్‌ మాల్‌ నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా దూరంగా నిల్చుని రమేశ్‌ను ముందుకు పంపించినట్లు తెలిసింది. అక్కడ రమేశ్‌ ఆమెతో గొడవ పడి గొంతుతో పాటు పలుచోట్ల పొడవగా తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. అయితే, చాలాసేపు ఆమె తనను హత్య చేయొద్దని రమేశ్‌, శ్రావణ్‌ను బతిమాలినట్లు సమాచారం. ఆ సమయాన వచ్చిన ఓ వృద్ధురాలిని సైతం నిందితులు బెదిరించినట్లు తెలిసింది. చిన్న గల్లీ కావడంతో హత్య విషయం ఆలస్యంగా బయటపడగా ఏసీపీ రమణమూర్తి, వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌ చేరుకుని పారిపోయిన రమేశ్‌ను జూలురుపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్‌ కోసం గాలిస్తున్నారు. ప్రమీల మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించగా ఆమె భర్త శ్రీనివాసరావు పాల్వంచకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించాడు. కాగా, ఖమ్మంలో మహిళల హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఐద్వా నాయకులు మార్చురి వద్ద ఆందోళన చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement