పందెం పిలుస్తోంది..
కోడి పందెం బిర్రులు సిద్ధం క్రికెట్ స్టేడియాన్ని తలపించేలా వేదికలు ఏపీకి పయనమయ్యేందుకు జూదరులు రె‘ఢీ’
సత్తుపల్లి: సంక్రాంతి పండుగ వస్తుందంటే.. కోడి పందేల సందడే సందడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, మధిర, వైరా నియోజకవర్గాలు ఏపీకి సరిహద్దుగా ఉండడంతో చాలామంది పందేలు చూసేందుకు వెళ్తుంటారు. ఇదే సమయాన పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే బిర్రులను సత్తుపల్లి పరిసర ప్రాంత వాసులే ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. కొందరు ఏపీలోని నూజివీడు సమీపాన మీర్జాపురంలో బిర్రు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద బిర్రుగా ప్రచారం జరుగుతోంది. క్రికెట్ స్టేడియాన్ని తలపించేలా చేపట్టిన నిర్మాణం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీవీఐపీల కోసం సోఫాలు, గ్లాస్ ఫిటింగ్‌తో ఏసీ చాంబర్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఏలూరు జిల్లా దెందులూరులో మినీ స్టేడియంతో పాటు వీఐపీల కోసం ఏసీ కంటెయినర్లు సిద్ధం చేసినట్లు సమాచారం. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో రాత్రి పందేలు కొనసాగేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారని సమాచారం.
రూ.25 లక్షల నుంచి..
ఈసారి కోడి పందేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మీర్జాపురంలో రూ.25 లక్షల పందేలు, రూ.9 లక్షలు, రూ.6 లక్షల బిర్రులు నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దెందులూరు, విస్సన్నపేటలో కూడా రూ.5 లక్షలకు తగ్గకుండా పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రా ప్రాంతంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఉండకపోవడంతో సురక్షితంగా పందేలు వేయొచ్చు, చూడొచ్చనే భావనతో పలువురు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా, జూదరులు పలువురు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తూ ఏ సమయాన, ఏ నక్షత్రంలో ఏ రంగు పుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్ని అనుసరించి ఏ పుంజుపై పందెం కాస్తే గెలుస్తామో చూసుకుంటారు.
రూ.కోట్లలో పేకాట
కోడి పందేల మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తుందని ప్రచారం. కోడి పందేలు ఓ ఎత్తయితే రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయట పేకాట నిర్వహిస్తుండటంతో రెప్పపాటులోనే రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇది కాకుండా గుండు పట్టాలతో జూదం నిర్వహిస్తారు.
పండుగ మూడు రోజులు
భోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడురోజులు పందేలకు అడ్డూ అదుపు ఉండదు. సంకలో కోడి పుంజు పట్టుకొని పరుగులు పెడుతూ జూదరులు కన్పిస్తుంటారు. ఆంధ్రా సరిహద్దులోని మామిడితోటలు చిన్న పందేలకు నిలయంగా మారుతాయి. పందేల స్థావరాల వద్దే మద్యం, బిర్యానీ, మాంసం విక్రయాలు సాగుతుంటాయి.
సంక్రాంతికి వచ్చేయండి..


