పతంగుల దుకాణాల్లో తనిఖీ
సత్తుపల్లిటౌన్/ముదిగొండ: చైనా మాంజాను నిషేధించిన నేపథ్యాన సత్తుపల్లిలోని పలు దుకాణాల్లో శనివారం అటవీ శాఖాధికారులు తనిఖీ చేశారు. పతంగులు ఎగుర వేసేందుకు చైనా మాంజా వాడితే వన్యప్రాణులతో పాటు ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని రేంజర్ స్నేహలత తెలిపారు. ఈ మేరకు కాటన్ దారాలనే పతంగులకు వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌ఓలు నర్సింహ, నాగరాజు, బీట్ ఆఫీసర్లు చెన్నకేశవరెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కిరాణా, ఫాన్సీ షాపుల్లో ముదిగొండ సీఐ ఓ.మురళి ఆదేశాలతో ఎస్‌ఐ అశోక్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఎవరు కూడా చైనా మాంజా అమ్మొద్దని, అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పించారు.
పతంగుల దుకాణాల్లో తనిఖీ


