గణనకు సిద్ధం
గణనకు వలంటీర్లను తీసుకుంటున్నాం
● జంతు సర్వేకు అటవీ శాఖ సన్నాహాలు ● జిల్లా అడవిలో ఈనెల 20 నుంచి 25 వరకు లెక్కింపు ● అటవీ శాఖ సిబ్బందితోపాటు ఔత్సాహిక వలంటీర్లకూ అవకాశం ● ఎప్పటికప్పుడే ఏఐటీఈ యాప్‌లో నమోదు
పాల్వంచరూరల్: పులులు, జంతువుల లెక్క తేల్చేందు కు అటవీశాఖ సిద్ధమైంది. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలోని పాల్వంచ అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు అటవీ డివిజన్లలో 24 రేంజ్‌ల పరిధిలోని 700 బీట్లలో 1,200 మందితో లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. డెహ్రాడూన్ వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో గణన చేపడతారు. పులులతోపాటు శాకాహార, మాంసాహార జంతువులెన్ని ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ సర్వే నిర్వహిస్తారు.
లెక్కింపు ఇలా..
ప్రతీరోజు బీట్‌కు ఇద్దరు చొప్పన ఐదు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ లెక్కిస్తుంటారు. నిర్దేశించిన బీట్‌లో ఏడు రోజులపాటు పులుల పాదముద్రలు, పెంటికలు, వెంట్రుకలు తదితర గుర్తులు సేకరించిన తర్వాత జంతువుల గణన చేపడుతారు. ఈ లెక్కింపు ఆధారంగానే భవిష్యత్‌లో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పులులు, జంతు గణన సందర్భంగా సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఏఐటీఈ(ఆల్ ఇండియా టైగర్స్ ఎస్టిమేషన్) యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సర్వే సిబ్బందికి టీషర్టులు, క్యాప్‌లతో పాటు ఓ కిట్‌గ్యాగ్ ఇస్తారు. అందులో పేపర్, పెన్ను, జిప్‌లాక్(ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) ఉంటాయి. కాగా, సర్వేపై సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించేందుకు ఈనెల 12న అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో రేంజర్లతో, 17న కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని గట్టుమల్ల బీట్‌లో స్థానిక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఆభయారణ్యంలో పెరిగిన జంతువులు
కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతో పాటు జంతువుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండడంతో వాటి సంతతి పెరుగుతోంది. గత జంతుగణన సమయంలో ఎలుగుబంట్లు 412, చుక్కుల దుప్పులు 4,278, కొండగొర్రెలు 659, అడవి పిల్లులు 674, అడవిగేదెలు 1,892, కణుజులు 508తో పాటు తోడేళ్లు, నక్కలు, కుందేళ్లు, అలుగు, మూషిక జింకలను గుర్తించారు. కాగా, ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులు లు, 14 చిరుతలు ఉండగా అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఒక పులి మాత్రమే సంచరిస్తోంది. ఈ ఏడాది లెక్కింపు పూర్తయితే కానీ ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనే వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక మూషిక జింకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సంచరిస్తున్నాయని గుర్తించిన అటవీ శాఖ వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది.
జిల్లాలోని 550 బీట్లలో పులు లు, జంతు గణనను పకడ్బందీగా నిర్వహించబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 75 నుంచి 100 మంది వలంటీర్లను తీసుకుంటున్నాం. ఈ గణనలో అటవీ సిబ్బంది 900 మంది పాల్గొంటారు. వీరికి తోడుగా బేస్ క్యాంప్ సిబ్బంది, వాచర్లు ఉంటారు. డీఆర్‌ఓలు, బీట్ అధికారులు, వలంటీర్లు బీట్‌కు ఇద్దరు చొప్పున ప్రతీ రోజు 5 కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు లెక్కించి, ఆ తర్వాత యాప్‌లో నమోదు చేస్తారు.
–జి.కృష్ణాగౌడ్, భద్రాద్రి డీఎఫ్‌ఓ
గణనకు సిద్ధం


