నేటి నుంచి మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం 54వ డివిజన్ వీడీవోస్ కాలనీలోని ఎన్‌టీఆర్ పార్క్ ను మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, సోమవారం ఉదయం రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో వ్యవసాయ స్ప్రేయర్ డ్రోన్ల అవగాహన సదస్సులో పాల్గొన్నాక రాములు తండాలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 13వ తేదీ మంగళవారం ఉదయం రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెం గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి, పథకం డెలివరీ పాయింట్ వద్ద రైతులతో సమావేశమవుతారు.
చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు
ఖమ్మంక్రైం: పక్షులు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను పతంగులు ఎగురవేసేందుకు విక్రయించినా, వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ హెచ్చరించారు. చైనా మంజా(సింథటిక్, దారం, గాజుపొడి) చాలా ప్రమాదకరమని తెలిపారు. దీని కారణంగా మనుషులు, పక్షులు ప్రమాదంలో పడుతున్నందున నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు విక్రయ, వినియోగదారులకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని సీపీ ఓ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆతర్వాత పల్లకీసేవ చేశారు. ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ చట్టసవరణలపై 20న నిరసనలు
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత పేదల కోసం కాంగ్రెస్ హయాంలో రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గాంధీ పేరును తొలగించడమే కాక చట్టసవరణతో పేదలకు పథకాన్ని దూరం చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు 20వ తేదీన జిల్లాలో నిరసనలు చేపడతున్నట్లు తెలిపారు. ఆరోజు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు వడ్డేబోయిన నరసింహా రావు, దొబ్బల సౌజన్య, ముల్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.


