ఖో–ఖో జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక
కల్లూరు: కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో శనివారం ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఖో–ఖో బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు 78 మంది బాలురు, 60 మంది బాలికలు హాజరుకాగా ఖో–ఖో అసోసియేషన్ బాధ్యుల పర్యవేక్షణలో జట్ల ఎంపిక కొనసాగింది. కాగా, క్రీడాకారులకు పరిపూర్ణ కిషోర్‌రెడ్డి భోజనం, పీఈటీ నరాల సాంబశివరెడ్డి, బానోతు చిరంజీవి క్రీడాకారులకు దుస్తులు సమకూర్చారు. కార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీర రాఘవయ్యతో పాటు సున్నం ప్రసాద్, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు, కాంట్రాతి రాధాకృష్ణ, తలపరెడ్డి గౌతమ్‌రెడ్డి, ఎం.గోపాల్, నవీన్, పాషా,కోటి, అనంతలక్ష్మి, తులసి పాల్గొన్నారు.
అయ్యప్ప శోభాయాత్రకు రాష్ట్రవాసుల ఎంపిక
ఖమ్మంఅర్బన్: కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆభరణాల శోభాయాత్రలో పాల్గొనే అవకాశం తెలంగాణ నుంచి పలువురు భక్తులకు దక్కింది. అలంగాడ్ యోగం ట్రస్ట్ ఆధ్వర్యాన నిర్వహించే యోగం పెట్ట పురప్పడ్ శోభాయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 25 మందిని ఎంపిక చేసినట్లు అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ రాష్ట్ర అధ్యక్షుడు, అలంగాడ్ యోగం ట్రస్ట్ పోషకుడు టీ.వీ.పుల్లంరాజు తెలిపారు. అలువాలోని మణప్పురం మహాదేవుడి ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర ఎరుమేలి వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయానికి కానుకలను ఊరేగింపుగా తీసుకువెళ్లే ఈ సంప్రదాయాన్ని పెట్ట పురప్పడ్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
సర్కారు బడుల
మూసివేతకు కుట్ర
● ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ
భద్రాచలంటౌన్: రేషనలైజేషన్ సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధుల కోత, ఖాళీల భర్తీ చేపట్టకుండా పేదలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ – 2025 బిల్లుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణను ప్రతీ ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎం.రామాచారి, అధ్యక్షుడిగా జి.హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా వి.వినోదిని, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు వై.అశోక్‌కుమార్, ఎ.సోమయ్య, కె.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉపాధ్యక్షుడిగా సంజయ్
టేకులపల్లి : బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ (బీఏఎన్‌ఏఈ ) జాతీయ ఉపాధ్యక్షుడిగా మండలంలోని బోడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోత్ సంజయ్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం నవీ ముంబైలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. సంజయ్ హైదరాబాద్‌లోని ఏఐఎంఎల్ వొక్సెన్ యూనివర్సిటీలో హెచ్‌ఓడిగా పనిచేస్తున్నాడు.
హోటల్‌లో చోరీ
తిరుమలాయపాలెం: మండలంలోని కేశ్వాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న హోటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పిండిప్రోలుకు చెందిన ఉడుగుల భిక్షం హోటల్ నిర్వహిస్తుండగా, సమీప బంధువు మృతి చెందడంతో శుక్రవారం వెళ్లిన ఆయన శనివారం మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికే హోటల్‌లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పరిశీలించగా నగదు, మద్యం బాటిళ్లు, సిగరెట్లు చోరీ అయినట్లు గుర్తించారు. సుమారు రూ.15 వేల విలువైన సామగ్రి చోరీ అయినట్లు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖో–ఖో జిల్లా బాలబాలికల జట్లు ఎంపిక


