ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ఖమ్మం సహకారనగర్: రోడ్డు ప్రమాదాల నియంత్రించడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పెట్రోల్ బంక్ నిర్వాహకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందితే ఆయనపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. పెట్రోల్ బంక్‌ల్లోకి వచ్చి, వెళ్లే మార్గాలు ప్రధాన రోడ్డును కలిసే చోట అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. అలాగే, బంక్‌కు ఇరువైపులా 100 మీటర్ల దూరాన రోడ్డుపై బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్‌లు ఏర్పాటుచేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌టీఓ డి.జగదీష్, డీఎల్‌ఎంఓ ప్రవీణ్ కుమార్, ఆర్ అండ్ బీ డీఈ జి.రాధిక తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25న మొదలయ్యే పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే హాల్‌టికెట్‌ను విద్యార్థి వాట్సప్ నకు పంపినందున తప్పులు ఉంటే సరిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్‌ఓ రామారావు, సీఐ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


