విస్తృత ప్రచారం, జన సమీకరణే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న జరగనుండగా విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు సూచించారు. భారీ జన సమీకరణే లక్ష్యంగా ప్రచారం కొనసాగాలని తెలిపారు. ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ ఎత్తున జన సమీకరణే లక్ష్యంగా గ్రామగ్రామాన ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, 10న అలంకరణ కమిటీ, కమిటీల సమావేశం, 11న కాగడాల ప్రదర్శన, 12న బహిరంగ సభ జయప్రదం కోరుతూ ట్రాక్టర్ల ర్యాలీ, అదే రోజు డీపీఆర్‌సీ భవనంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక 13న జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఇళ్లపై సీపీఐ జెండాలు ఎగురవేయాలని, 14న గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈసమావేశం అనంతరం నాయకులు బహిరంగ సభ జరగనున్న ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కార్యదర్శులు దండి సురేష్, సాబీర్‌పాషా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, బీజీ.కై ్లమెంట్, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి, కొండపర్తి గోవిందరావు, మేకల శ్రీనివాసరావు, పోటు పూర్ణ, చింతల రమేష్, నంబూరి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
12న కవితా సంచిక ఆవిష్కరణ
సీపీఐ విజయాలు, పోరాటాలపై రాసిన కవితలతో రూపొందించిన ‘నూరేళ్ల అరుణ కేతనం’ కవితా సంచికను 12వ తేదీన ఆవిష్కరిస్తామని కమిటీ బాధ్యుడు లెనిన్ శ్రీనివాస్ తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచిక కోసం వంద మంది కవులు తమ రచనలను పంపించారని వెల్లడించారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో
బాగం హేమంతరావు


