జాతీయ రహదారులపై మరింత భద్రత
సత్తుపల్లిటౌన్/కల్లూరురూరల్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కట్టడికి మరిన్ని భద్రతా చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ సూచించారు. కల్లూరులోని ప్రధాన సెంటర్, పెనుబల్లి జంక్షన్, లంకపల్లి, కిష్టారం వై జంక్షన్, తాళ్లమడ బ్రిడ్జి, ఏన్కూరులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాప్‌లో నమోదు చేసి నివారణ చర్యలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తొలుత జీబ్రా క్రాసింగ్‌లు, రంబుల్ స్ట్రిప్స్, మార్కింగ్‌లు, సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ హరిబాబు, నేషనల్ హైవే ఇంజనీర్ కిరణ్, సత్తుపల్లి ఎంవీఐ జేఎన్.శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్ నాగేశ్వరరావు, సీఐ శ్రీహరి, కల్లూరు ఎస్సై హరిత తదితరులు పాల్గొన్నారు.


