తలసేమియా రహిత భారతాన్ని నిర్మిద్దాం...
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె అన్నారు. ఖమ్మంలోని సంస్థ కార్యాలయం వద్ద గురువారం తలసేమియా చిన్నారులకు ఉచిత రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్‌గార్గె మాట్లాడుతూ తలసేమియాతో పిల్లలు జన్మించకుండా దంపతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, తలసేమియా చిన్నారులను తల్లిదండ్రులు, సమాజం భారంగా చూడకుండా రక్తదానంతో అండగా నిలవాలని తెలిపారు. ఈనెల 12న తలసేమియా జాతీయ సొసైటీ బాధ్యులు డాక్టర్ అరోరా బృందం ఆధ్వర్యాన ఖమ్మంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, చిన్నారులకు సేవలందించేందుకు ముందుకొచ్చిన పలువురిని రాజేష్‌గార్గె సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ఎన్.నర్సయ్యతో పాటు డాక్టర్ డి.నారాయణమూర్తి, డాక్టర్ లక్ష్మీదీపా, సంస్థ ఫౌండర్ పి.అనిత, బాధ్యులు పావని, పి.రవించదర్, ఉదయ్ భాస్కర్, ఎన్.ఉపేందర్, అనురాధ, షీవేన్ తదితరులు పాల్గొన్నారు.
‘సంకల్ప’ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ గార్గె


