రైతులకు మెరుగైన సేవలు
మధిర/ఖమ్మం వైద్యవిభాగం: రైతులు, జీవాల పెంపకందారులకు పశు వైద్య సిబ్బంది ఉత్తమ సేవలు అందించాలని టీవీకే, ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వాహనాల రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ భగీష్ మిశ్రా సూచించారు. మధిర సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు సంవర్ధక శాఖ సంచార వాహనాల(1962)ను గురువారం ఆయన తనిఖీ చేశారు. మధిరలో గత మూడు నెలలుగా జీవాలకు చేసిన చికిత్స అందించిన టీకాలపై ఆరా తీశాక ప్రతినెలా 300 వరకు చికిత్సలు చేస్తున్న ఉద్యోగులన అభినందించారు. ఆతర్వాత 108, 102 వాహనాలను కూడా ఆయన పరిశీలించారు. వాహనాల జిల్లా మేనేజర్ ఆవులూరి దుర్గాప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, డాక్టర్ సౌజన్య, సిబ్బంది నందిని, వెంకటేశ్వర్లు, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
‘అధిష్టాన్’ బిల్లును
వెనక్కి తీసుకోవాలి
ఖమ్మంమయూరిసెంటర్: వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు –2025ను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వంకాయల రాజు అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు పేరిట రాష్ట్రాల హక్కులు కాలరాసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై ముగ్గురు మంత్రులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. నాయకులు ఉమేష్, హారీష్,వెంకటేష్, త్రినాథ్, లోకేశ్,సుశాంత్, మనోజ్, రమణ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే నష్టపోయేది సామాన్య, మధ్యతరగతి ప్రజలేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీటీబీఈఎఫ్) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జన జాగృతి యాత్ర గురువారం సాయంత్రం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో కలిసి హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాన్ని నిలిపివేయాలని, సరిపడా ఉద్యోగులను నియమించి, ఐదు రోజుల పనిదినాలు అమలుచేయాలన్నారు. హైదరాబాద్ నుంచి యాత్ర నిర్వహిస్తున్న కెనరా బ్యాంకు ఉద్యోగి ఉమామహేష్‌తో పాటు నాయకులు దండి సురేష్, సమద్, రాజేష్, వి.శ్రీకాంత్, కుమార్, శివరామకృష్ణ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మూడు టిప్పర్లు సీజ్
వైరా రూరల్: మండలంలోని రెబ్బవరం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. పక్కా సమాచారంతో గురువారం తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు టిప్పర్లను సీజ్ చేయడమే కాక డ్రైవర్లు గుంపిడి సురేష్, అడప మహేష్, యజమాని పిల్లలమర్రి రాంబాబుపై కేసు నమోదుకు వైరా పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.
రైతులకు మెరుగైన సేవలు
రైతులకు మెరుగైన సేవలు


