కలకోటలో చేపల చోరీకి యత్నం
బోనకల్: మండలంలోని కలకోట చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చేపల చోరీకి యత్నించారు. అదే సమయానికి మత్స్య సహకార సంఘం సభ్యులు వచ్చేసరికి వారు పారిపోయారు. అప్పటికే పెద్దమొత్తంలో చేపలు పట్టి తరలించేందుకు సిద్ధం కాగా, వాటితో పాటు వలలను వదిలేసి వెనుదిరిగారు. ఘటనపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
మధిర: మధిర – తొండలగోపవరం రైల్వేస్టేషన్ల మధ్య గురువారం రైలు నుంచి జారిపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డులోని వివరాల ఆధారంగా బిహార్ రాష్ట్రానికి చెందిన దాతీలాల్(27)గా గుర్తించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ఆర్కే ఫౌండేషన్ బాధ్యులు సహకారంతో మధిర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా, వివరాల కోసం 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
సత్తుపల్లిరూరల్: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటకు చెందిన మేధమంచి వరప్రసాద్(65) గురువారం తన ద్విచక్రవాహనంపై వస్తుండగా.. సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.
ఉరి వేసుకుని యువకుడి బలవన్మరణం
ఖమ్మం అర్బన్: ఖమ్మం పాండురంగాపురానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. పాండురంగాపురానికి చెందిన శాసనాల రాఘవేంద్ర(31) మద్యం సేవిస్తూ జులాయిగా తిరిగేవాడు. ఆయన ప్రవర్తన నచ్చక భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా, తల్లిదండ్రులు మరోచోట నివాసం ఉంటున్నారు. ఈక్రమాన రాఘవేంద్ర బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి మార్చురీకి తరలించినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
కలకోటలో చేపల చోరీకి యత్నం


