విద్యుత్ అధికారుల ‘ప్రజాబాట’
ఖమ్మంవ్యవసాయం/రఘునాథపాలెం/ ముదిగొండ/బోనకల్/కల్లూరు రూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూపొందించిన ప్రజాబాట కార్యక్రమం జిల్లాలో గురువారం కొనసాగింది. ఎస్‌ఈ మొదలు డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ అధికారులు, ఉద్యోగులు నిర్దేశించిన గ్రామాలు, ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లూజ్ లైన్లు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, సక్రమంగా పని చేయని ట్రాన్స్‌ఫార్మర్లు, తరచూ అంతరాయాలు, నిర్వహణ లోపాలపై ఫిర్యాదులు అందాయి. అంతేకాక లో ఓల్టేజీ సమస్య పరిష్కారానకి నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, పని చేయని మీటర్లు మార్చాలని, బిల్లుల్లో తేడాలను సరిచేయాలని వినతిపత్రాలు ఇచ్చారు. ఇంకొన్నిచోట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధి సుందరయ్యనగర్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమాల్లో ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈ నంబూరి రామారావు, సబ్ డివిజనల్ ఇంజనీర్ సీహెచ్.నాగార్జున తదితరులు పాల్గొని సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇక రఘునాథపాలెం మండలంలోని రాములుతండా, రఘునాథపాలెంల్లో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీ సంజయ్‌కుమార్, ఏఈలు సతీష్, శంకర్ పాల్గొనగా సర్పంచ్‌లు జి.కృష్ణారావు, వెంకరామ్, స్థానికులు సమస్యలను వివరించారు. అలాగే, ముదిగొండలో నిర్వహించిన ప్రజాబాటలో ఏడీఈ రమ్య, సర్పంచ్ కట్టకూరి ఉపేందర్, ఉపసర్పంచ్ పార్వతి, ఏఈ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొల్గొన్నారు. ఇక బోనకల్ మండలం ముష్టికుంట్ల, కల్లూరు మండలం లక్ష్మీపురం(రాళ్లబంజరు)లో జరిగిన ప్రజా బాట కార్యక్రమాల్లో ఏడీఏ వైవీ.ఆనంద్, ఏఈలు టి.మనోహర్, మహేంద్రబాబు, సర్పంచ్‌లు పిల్లలమర్రి నాగేశ్వరావు, భూక్యా రవీంద్రబాబు, ఉద్యోగులు ఉస్మాన్‌బేగ్, బత్తుల సత్యనారాయణ, శ్రీను, జమీల్, ఏసుపాదం పాల్గొన్నారు.
సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ


