రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
వైరా: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ ఆదేశించారు. వైరాలోని రింగ్‌రోడ్డు సెంటర్, బస్టాండ్ ఆవరణను బుధవారం పరిశీలించిన ఆమె వాహనాల రాకపోకలు, ఇటీవల జరిగిన ప్రమాదాలపై అఽధికారులతో సమీక్షించారు. అయితే, ఆర్టీసీ బస్టాండ్‌లో తల్లాడ రోడ్డు వైపు గేటు మూసివేతపై స్థానికులు ఫిర్యాదు చేశారు. బస్సులన్నీ ఒకవైపే వస్తుండడంతో ఇటీవల ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. అనంతరం ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ అపూర్వ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రమాదాల కట్టడికి అవసరమైన మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీ డీఈ ఎం.రమేష్‌తో పాటు పోలీసు, రవాణా శాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


