ఆశ పడితే.. ఊచలే !
కమీషన్‌కు కక్కుర్తి పడితే...
● సైబర్ నేరాల నిధులకు ఖాతాలు అప్పగింత ● ఉచ్చులో చిక్కుకున్న అమాయకులు ● ఇప్పుడు ముఖం చాటేస్తున్న సూత్రధారులు
సత్తుపల్లి: సైబర్ నేరగాళ్ల లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే, సూత్రధారులు, పాత్రధారులు పాత నేరస్తులే అవుతుండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ల వెనుక సత్తుపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. కాంబోడియా కేంద్రంగా ఈ నేరానికి పాల్పడగా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన దాసరి మణిరాం, శివకృష్ణ, బ్రహ్మనాయుడు, పవన్‌కల్యాణ్‌ను రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను కోర్టు అనుమతితో సత్తుపల్లి రూరల్ పోలీసులు రెండు రోజులు విచారించి తిరిగి జిల్లా జైలుకు పంపించారు. అయితే సైబర్ నేరాలకు పాల్పడిన వారు తెలివిగా పలువురి అకౌంట్లను సేకరించి డబ్బు జమ చేయగా.. వారిని విచారిస్తుండడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతుండగా, పోట్రు కల్యాణ్ తదితరుల కోసం గాలిస్తున్నారు.
బెట్టింగ్ అప్పులు తీర్చి..
అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి సత్తుపల్లిలో చదివాక పీజీ చేశాడు. ఆ సమయంలో సత్తుపల్లిలోని ప్రముఖ పాఠశాల బాధ్యుడి కుమారుడితో స్నేహం ఏర్పడింది. అశ్వారావుపేట యువకుడు విద్యాభ్యాసం తర్వాత పొట్టకూటి కోసం ఆటో నడుపుతూ క్యాటరింగ్ చేస్తుండగా బెట్టింగ్ వ్యసనంతో రూ.4 లక్షల అప్పులయ్యాయి. ఆ సమయాన సైబర్ నేరాల్లో కీలక వ్యక్తి కలిసి తనతో ఉన్నవాళ్లంతా డబ్బు సంపాదించారని, తనతో వస్తే బాకీలు తీరుస్తానని నమ్మించి హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో ఉద్యోగం ఇచ్చాడని తెలిసింది. ఆపై ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ మోసాల్లో శిక్షణ ఇవ్వగా వ్యవహారమంతా అశ్వారావుపేట వాసి పేరిట నడవడంతో ఆయన ఇప్పుడు కేసు నమోదైంది. కేసు నుంచి బయట వేయమని బాధ్యుల కుటుంబీకులను కోరితే బుకాయిస్తున్నారని ఆయన తల్లి వాపోతోంది. ప్రధాన నిందితులు మాత్రం రూ.కోట్లు కొల్లగొట్టి జల్సాలు చేస్తుండగా.. వీరి ఆగడాలపై నోరు మెదిపేందుకు కమీషన్ కోసం ఆశపడిన వారు జంకుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అప్పనంగా వచ్చే కమీషన్‌కు కక్కుర్తిపడిన కొందరు ఆధార్, పాన్‌కార్డులను ఆర్థిక నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. సత్తుపల్లి డివిజన్‌లో పలు వురు ఇలా ఖాతా వివరాలు ఇచ్చాక అందులో నేరగాళ్లు డబ్బు జమ చేయించడంతో పోలీసు ల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. నిందితులు రూ.లక్షకు రూ.20వేలు కమీషన్ కింద మినహాయించుకొని మిగిలిన డబ్బు ఇవ్వాలనే నిబంధనతో ఖాతాలు సేకరించినట్లు సమాచారం. వేంసూరు మండలం రాజుగూడెంకు చెందిన ఓ వ్యక్తి ఈ తరహా అకౌంట్లు తెరిపించి డబ్బు బదలాయించిన తర్వాత కొందరు డబ్బులు వాడుకోవటంతో వారిని చితకబాది రికవరీకి ప్రయత్నించినట్లు తెలిసింది.


