గొల్లగూడెం గోశాలకు రూ.1.20లక్షల వితరణ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెంలోని ఓం శ్రీకృష్ణ గోశాల వెల్ఫేర్ సొసైటీకి ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్, వాసవీ సేవా సభ్యులు బుధవారం రూ.1.20లక్షల విరాళం అందజేశారు. గోవుల గ్రాసం నిమిత్తం ఈ విరాళం అందజేశారని గోశాల బాధ్యులు కేసా హన్మంతరావు తెలిపా రు. ఇందుకు సహకరించిన చిట్టిమల్ల సరిత, పెర్ల మూర్తి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పూర్వ విద్యార్థినుల విరాళం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధికి 1978–19వ బ్యాచ్ విద్యార్థినులు 65వేల విరాళం అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగించాలని కోరుతూ హెచ్‌ఎం శైలజా లక్ష్మికి బుధవారం నగదు అందజేశారు. పూర్వ విద్యార్థినులు విజయశ్రీ, నిర్మల, సుధారాణి, లక్ష్మి, పి.ఇందిర, కె.అనురాధ, ఉమ, ప్రసన్న, దుర్గ, మాధవి, స్వర్ణలత, పద్మజ, ఝాన్సీలక్ష్మీ, కృష్ణకుమారి, ఎం.విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
కాల్వొడ్డు బ్రిడ్జిపై
కార్లు, ఆటోలకు అనుమతి
ఖమ్మంక్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ పెరగనుండడంతో ఖమ్మంలోని కాల్వొడ్డు వద్ద మున్నేటి పాత బ్రిడ్జిపై కార్లు, ఆటోల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇన్నాళ్లు ద్విచక్రవాహనాలకే అనుమతి ఉండగా, బుధవారం నుంచి 20వ తేదీ వరకు కార్లు, ఆటోలు రాకపోకలు సాగించొచ్చని వెల్లడించారు. బైపాస్ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తే ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, పాత బ్రిడ్జిపై రెండు వైపులా తవ్వి ఉన్నందున వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు.
పశుసంపద..
గ్రామ ఆర్థిక బలానికి పునాది
రఘునాథపాలెం: గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకంగా నిలుస్తుందని జిల్లా పశువైద్యాధికారి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలో బుధవారం పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స కోసం ఏర్పాటుచేసిన శిబిరాన్ని సర్పంచ్ కాపా ఆదినారాయణతో కలిసి ప్రారంభించాక ఆయన మాట్లాడా రు. పశుసంవర్ధక శాఖ సేవలు రైతులకు అందేలా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు కృషి చేస్తే పశు సంపద వృద్ధి సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ పలువురు రైతుల పశువులకు చికిత్స చేయగా, జిల్లా లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ అధికారి రూప్‌కుమార్, ఉప సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి బి.కృష్ణ, సిబ్బంది టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం గత ఇరవై నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో పెన్షనర్లు క్షోభకు గురవుతున్నారని, వారి కన్నీరు ప్రభుత్వానికి మంచిదికాదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ పెన్షనర్ల అసోసియేషన్(పీఆర్‌పీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి మధు అన్నారు. ఖమ్మంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు, నాయకులు గంగవరపు శంకరయ్య, చలపతిరావు, నంబూరి కనకదుర్గ, కొండలరావు, సాధు లక్ష్మణ్‌రావు, గజేంద్రుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పీఆర్‌పీఏ జిల్లా కన్వీనర్‌గా యలమద్ది వెంకటేశ్వర్లు, కోకన్వీనర్‌గా పిల్లలమర్రి కొండలరావు ఎన్నుకున్నారు.
గొల్లగూడెం గోశాలకు రూ.1.20లక్షల వితరణ


