జీఆర్‌సీలతో మహిళలకు భరోసా
వేధింపుల నుంచి విముక్తికి సెంటర్లు
తొలి విడతగా జిల్లాలో నాలుగు
మండలాలకు నిధులు
జండర్ రిసోర్స్ సెంటర్ల నిర్వహణపై మొదలైన శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాల్లో వేధింపులు, సామాజిక వివక్ష ఎదుర్కొంటున్న మహిళలకు తక్షణ సాయం అందించేందుకు జండర్ రిసోర్స్ సెంటర్లు(జీఆర్‌సీ) ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించడమే కాక బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
వేధింపుల నుంచి విముక్తి
గ్రామీణ ప్రాంత మహిళలు గృహహింస, ఇతర వేధింపులకు గురైనా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చట్టపరమైన అవగాహన లేక మౌనంగా భరిస్తున్నారు. ఇలాంటి వారికి జీఆర్‌సీలు పరిష్కారం చూపనున్నాయి. సెర్ప్ సీఈఓ ప్రత్యేక కార్యాచరణతో జీఆర్‌సీలపై జిల్లాల వారీగా మండల సమాఖ్యలు, ఏపీఎంలు, సీఓలు, సీసీలు, ఓబీలకు శిక్షణ ఇస్తున్నారు.
నాలుగు మండలాలు ఎంపిక
తొలి విడతగా జిల్లాలో జీఆర్‌సీల ఏర్పాటుకు నాలుగు మండలాలను ఎంపిక చేశారు. బోనకల్, మధిర, కల్లూరు, ఖమ్మం రూరల్ మండలాల్లో సెంటర్ల ప్రారంభానికి ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను సెంటర్‌లో వసతుల కల్పనకే కాక బాధితుల సహాయ, సహకారాల కోసం వెచ్చించనున్నారు. తొలుత ఈ సెంటర్లను మండల సమాఖ్య కార్యాలయంలోనే నిర్వహిస్తారు.
ఫిర్యాదులు, సేవలు..
జీఆర్‌సీల్లో సఖి భరోసా సెంటర్ మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు బాధితులకు తక్షణ సేవలు అందిస్తారు. బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, వైద్యసేవలను అందజేస్తారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొనే వారికి నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. అలాగే, పోలీస్, ఆశ, అంగన్‌వాడీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యుల ద్వారా మహిళా హక్కులు, చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఇలాంటి వ్యవస్థలు గ్రామీణ స్థాయికి చేరడం ద్వారా మహిళలు ఆర్థికంగానే కాక సామాజికంగా ధైర్యంగా ఉంటారని చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి
సెర్ప్‌లో భాగమైన జండర్ విభాగం ద్వారా జీఆర్‌సీ(జండర్ రిసోర్స్ సెంటర్)ల నిర్వహణను మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్యలకు అప్పగిస్తున్నట్లు డీఆర్‌డీవో ఆర్.సన్యాసయ్య వెల్లడించారు. ఖమ్మం టీటీడీసీలో నాలుగు మండలాల సమాఖ్యలు, ఓబీలు, ఏపీఎం, సీఓలు, సీసీలకు బుధవారం ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. లింగ వివక్ష, దాడుల సమయాన మహిళలకు అండగా నిలుస్తూ, సెంటర్ల ద్వారా అందే సేవలను గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య, మహిళ శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహిళలకు అవసరమైన సలహాలు, సేవలను అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో సెర్ప్ జండర్ అడ్వైజర్, ట్రైనర్ జమున జీఆర్‌సీల నిర్వహణపై శిక్షణ ఇవ్వగా, అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ, డీపీఎం ఆంజనేయులు, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


