‘యాంత్రీకరణ’ రేపు పునఃప్రారంభం
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఈనెల 9న పునః ప్రారంభించనుండగా, ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని ఆయిల్‌ఫెడ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, అశ్వారావుపేట ఏజీ కాలేజీ ఏడీ డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ కళాశాలలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారని, తద్వారా రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందుతాయని చెప్పారు. అదేరోజు ఆయిల్‌ఫెడ్, వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతు మేళా కూడా నిర్వహిస్తున్నామని, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్, విశ్వవిద్యాలయం డీడీ గోపి హాజరవుతారని వివరించారు. దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేయనున్న లీఫ్ అండ్ సాయిల్ టెస్ట్(భూసార పరీక్ష కేంద్రం) ల్యాబ్, స్థానిక వ్యవసాయ కళాశాలలో జీవ వైవిధ్యానికి సంబంధించిన బయోపార్క్, కళాశాలలో రూ.5కోట్లతో అదనపు బాలికల వసతి భవనానికి, రూ.3కోట్లతో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ ఓపీడీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఏడీఏ రవి, హెచ్‌ఆర్‌ఎస్ హెడ్ శాస్త్రవేత్త శ్రీనివాస్, ఆయిల్‌ఫెడ్ మేనేజర్లు నాగబాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకానున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్


