ప్రాక్టికల్స్‌కు రూ.50వేల చొప్పున నిధులు
సత్తుపల్లిటౌన్: జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం రూ.50వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని డీఐఈఓ రవిబాబు తెలిపారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో బుధవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం నాలుగు చొప్పున డిజిటల్స్ స్క్రీన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలాగే, వెనకబడిన విద్యార్థులకు కోసం అధ్యాపకులు ప్రతిరోజు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహిస్తూ నూరు శాతం ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని, ఈ కెమెరాల పుటేజీ హైదరాబాద్ ఇంటర్‌బోర్డ్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధాననమవుతుందని తెలిపారు. కాగా, తొలిసారి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ముందస్తుగా హాల్‌టికెట్లు విడుదల చేసినందున తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల బాధ్యులు జీ.వీ.లింగారెడ్డి, పాలా ప్రవీణ్‌రెడ్డి, ఎం.మమంద్రారెడ్డి ఉన్నారు.
డీఐఈఓ రవిబాబు


