డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా..
● ప్రభుత్వ ఉపాధ్యాయుడి బైక్ యాత్ర ● ఇప్పటివరకు 500 ప్రాంతాల్లో ప్రదర్శనలు
నేలకొండపల్లి: డగ్ర్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘నో డ్రగ్స్.. సేఫ్ లైఫ్’పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టాడు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ ఫిబ్రవరి 16న సూర్యాపేటలో యాత్ర ప్రారంభించారు. సెలవు రోజుల్లో బైక్‌పై ఇప్పటివరకు సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన ఆదివారం నేలకొండపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన బాల్య మిత్రుడు డ్రగ్స్‌కు బాని సై కేన్సర్ వ్యాధితో మరణించాడని, మత్తు పదార్థాలతో నిత్యం పలు ప్రాంతాల్లో ప్రమాదాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండేందుకే తాను ఇప్పటివరకు 3 వేల కిలోమీటర్ల మేర బైక్ యాత్ర నిర్వహించి, 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చానని, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా నని వివరించారు. తన సెలవులను సొంత అవసరాలకు వినియోగించకుండా ఈ యాత్రకే ఉపయోగిస్తున్నానని చెప్పారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాను చేస్తున్న ప్రచారాన్ని పలువురు హేళన చేస్తున్నారని, అయినా పట్టించుకోకుండా యువతలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.


