మూడేళ్ల ముచ్చటే...
● సత్తుపల్లి సీహెచ్‌పీ క్రషర్ బంకర్‌కు పగుళ్లు ● నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంపై విమర్శలు ● అధికారుల పర్యవేక్షణ లోపంపైనా చర్చ
సత్తుపల్లి: ఆధునిక పరిజ్ఞానంతో సింగరేణి చరిత్రలోనే తొలిసారి సత్తుపల్లిలో నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ) మూడేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. బొగ్గు రవాణాలో అత్యంత కీలకమైన క్రషర్ బంకర్‌కు పగుళ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2022 మే 28న సీహెచ్‌పీ నుంచి కొత్తగూడెంకు రైల్వేలైన్ ద్వారా బొగ్గు రవాణా మొదలుపెట్టారు. రోజుకు 32వేల టన్నుల చొప్పున ఎనిమిది రేకులతో బొగ్గు రవాణా చేసేందుకు సీహెచ్‌పీని నిర్మించారు. కానీ మూడేళ్లకే మరమ్మతులు రావడంతో నిర్మించిన సమంత కంపెనీ నిర్లక్ష్యమా.. పట్టించుకోని అధికారుల తప్పిదం కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఇది పక్కన పెడితే సీహెచ్‌పీని జనావాసాల సమీపాన నిర్మించడంతో బొగ్గు లోడింగ్ సమయాన వెలువడే దుమ్ము కారణంగా కిష్టారం అంబేద్కర్ కాలనీవాసులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికే కొందరు మృత్యువాత పడిన నేపథ్యాన కారణమైన అధికారులు, సమంత కంపెనీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాదిన్నర నుంచి..
రూ.393 కోట్లతో హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను సమంత కంపెనీ టెండర్ ద్వారా దక్కించుకుంది. యార్డ్ నుంచి క్రషర్ స్టేషన్‌కు బొగ్గును తరలించనుండగా, రిసీవింగ్ కాంప్లెక్స్‌లో 150 టన్నుల సామర్ధ్యంతో మూడు క్రషర్ బంకర్లు నిర్మించారు. వీటిలో రెండు మాత్రమే వినియోగిస్తూ ఒకటి అత్యవసర సమయంలో వినియోగించేలా డిజైన్ చేశారు. అయితే ఒకటి, మూడు బంకర్లు బాగానే ఉన్నా రెండో బంకర్‌కు పగుళ్లు రావడంతో సమస్య తలెత్తింది. ఇది జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా మరమ్మతులు ఎలా చేపట్టాలో అంతు పట్టక సింగరేణి యాజమాన్యం పరిశీలన కోసం కమిటీలను నియమించింది. కాగా, ఏడాది కాలంలో ఏ సమస్య వచ్చినా సమంత కంపెనీనే భరించేలా ఒప్పందం ఉంది. ఆపై సింగరేణి కార్మికులు పర్యవేక్షించేలా కొందరికి శిక్షణ ఇచ్చారు. కానీ తరచూ ఏదో ఒక సమస్య వస్తుండడం గమనార్హం.
మరమ్మతులు తప్పనిసరి
వరంగల్ నిట్ ప్రొఫెసర్ల సూచనలతో క్రషర్ బంకర్‌కు మరమ్మతులు చేపట్టాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా బంకర్లను శుభ్రం చేయించారు. ఇకపై డంపింగ్ యార్డ్ నుంచి బొగ్గు బంకర్‌లోకి వెళ్లకుండా నేరుగా సైలో బంకర్ ద్వారా రైల్వే వ్యాగన్లలో లోడింగ్ అయ్యేలా చూస్తున్నారు. మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉండడంతో బొగ్గు రవాణాకు ఆంటకం ఎదురుకాకుండా 4వేల టన్నుల బొగ్గును రోడ్డు మార్గాన టిప్పర్లతో రవాణాకు నిర్ణయించారు. ఇకపోతే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వద్ద దుమ్ము లేవకుండా, బొగ్గుకు నిప్పంటుకోకుండా పైప్‌లైన్‌తో నీళ్లు చల్లుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా లోడింగ్ చేయించాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో సైలో బంకర్ నుంచి నిత్యం దుమ్ము లేస్తూ గాలిలో కలుస్తున్న నేపథ్యాన ప్రభావిత ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.
క్రషర్ బంకర్ల మరమ్మతులకు యాజమాన్యం జనవరిలో
టెండర్లు పిలవనుంది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంపైనా సమగ్ర విచారణ చేపట్టింది. బాధ్యులపై
చర్యలు తీసుకుంటారు. మరమ్మతులు పూర్తయ్యాక ప్రస్తుత సామర్థ్యానికి మించి బొగ్గు రవాణా చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
– చింతల శ్రీనివాస్, జీఎం, సత్తుపల్లి ఏరియా
మూడేళ్ల ముచ్చటే...


