ఈ తప్పులకు బాధ్యులెవరు? | - | Sakshi
Sakshi News home page

ఈ తప్పులకు బాధ్యులెవరు?

Nov 11 2025 5:55 AM | Updated on Nov 11 2025 5:55 AM

ఈ తప్పులకు బాధ్యులెవరు?

ఈ తప్పులకు బాధ్యులెవరు?

వాహనం ఉందని, గతంలోనే ఇల్లు మంజూరైందనే కారణాలతో షాక్‌

మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్న యంత్రాంగం

ఉన్న ఇల్లు కూల్చేసి రోడ్డున పడ్డామని పలువురి ఆవేదన

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల తిప్పలు అన్నీఇన్నీ కావు. నిర్మాణంలో దశల వారీగా రావాల్సిన బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీనికి కారణాలు ఆరా తీస్తే కొందరికి నాలుగు చక్రాల వాహనం ఉందని.. ఇంకొందరికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉందని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్న సమాధానంతో కంగుతింటున్నారు. జిల్లాలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

441 ఇళ్లకు సమస్య

జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సమస్య ఉన్నట్లు తేలింది. నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారని 52 మంది బిల్లులు పక్కన పెట్టారు. మరో 260 మంది గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్నట్లు చెబుతూ అనర్హులుగా నిర్ణయించారు. అయితే ఇందులో గత ప్రభుత్వ హయాంలో 30 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌తోనే నిలిచిపోగా, వీటిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారుల నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే వారికి దశల వారీగా బిల్లు జమ కానుంది. మరో 129 మంది దరఖాస్తులకు క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సి ఉంది.

ప్రొసీడింగ్స్‌ ఇచ్చి...

ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న కొందరు బేస్‌మెంట్‌ వరకు, ఇంకొందరు లెంటల్‌ లెవల్‌ వరకు నిర్మాణం పూర్తిచేశారు. అయినా బిల్లు జమ కాకపోవడంతో అధికారుల వద్ద ఆరా తీశారు. ‘మీ పేరు మీద గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. నిర్మాణం కూడా చేపట్టడంతో బిల్లు ఖాతాలో పడినట్లు చూపుతోంది’ చెప్పారని వాపోతున్నారు. అయితే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ప్రొసీడింగ్‌ ఇచ్చాక ఇప్పుడు బిల్లు విషయంలో ఇలా చేయడం సరికాదని చెబుతున్నారు. అంతేకాక బిల్లులు వస్తాయనే ఆశతో అప్పు చేసిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వారి నిర్లక్ష్యమే..

గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వివరాలు అన్ని జిల్లాలు, మండలాలకు ప్రభుత్వం పంపింది. దీంతో జాబితాను పరిశీలించి అందులో ఎవరైనా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మొదటే తిరస్కరించాలి. కానీ మండల స్థాయి యంత్రాంగం నిర్లక్ష్యంతో కొందరికి ప్రొసీడింగ్స్‌ జారీ అయ్యాయి. ఇప్పుడు బిల్లు కోసం వెళ్తే గత వివరాలు చెబుతుండడంతో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. కొందరు పాత ఇళ్లను తొలగించడంతో ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇల్లు పోయింది.. బిల్లు రాలేదు..

ఖమ్మం కార్పొరేషన్‌ పరిధి ఒకటో డివిజన్‌ కై కొండాయిగూడెం తేజావత్‌తండాలో ఒకరికి ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం ఇచ్చారు. దీంతో ఆమె పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటికి ముగ్గు పోసుకుంది. ఆ తర్వాత అధికారులు ఫొటో అప్‌లోడ్‌ చేశారు. ఆపై పునాదుల వరకు నిర్మించాక మరోమారు ఫొటో తీసుకున్నారు. కానీ పునాదుల తర్వాత రూ.లక్ష బిల్లు మంజూరు కాలేదు. ఈవిషయమై అధికారులను సంప్రదిస్తే ఆలస్యమైనా బిల్లు వస్తుందని నమ్మకంగా చెప్పడంతో లెంటల్‌ లెవల్‌ వరకు పూర్తిచేసింది. ఆతర్వాత కూడా బిల్లు రాక అధికారులు సంప్రదిస్తే పీడీని కలవాలని సూచించారు. ఆమె పీడీ వద్దకు వెళ్తే గతంలోనే ఇల్లు మంజూరైనట్లుగా ఆన్‌లైన్‌లో ఉన్నందున బిల్లులు రాలేదని బదులిచ్చారు. దీంతో తాము ఇల్లు కట్టలేదని.. ఇప్పుడు అప్పు చేసి నిర్మాణం ప్రారంభించి నందున న్యాయం చేయాలని వేడుకుంది.

ఇందిరమ్మ లబ్ధిదారుల్లో కొందరికి అందని బిల్లులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement