‘సదరమ్’ అక్రమాలపై కన్నెర్ర
● విచారణ చేయించిన కలెక్టర్ అనుదీప్ ● సీనియర్ అసిస్టెంట్‌పై వేటు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు ● పూర్వ సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓకు నోటీసులు
ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు వైకల్య శాతం ఆధారంగా సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగం కొనసాగుతోంది. అయితే, కొందరు సిబ్బంది అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యాన కలెక్టర్ దృష్టి సారించారు. ఈమేరకు ఒక సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పూర్తిగా విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక అర్హత లేకున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి సదరమ్ సర్టిఫికెట్ జారీ చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడు, సంతకాలు చేసిన ఆనాటి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓకు నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టించింది.
అనుకూలంగా మార్చుకుని...
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో షెడ్యూల్ ప్రకారం సదరమ్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్లాట్ ఆధారంగా దివ్యాంగులు వస్తుండగా.. అర్హులతో పాటు నామమాత్రపు వైకల్యం ఉన్న వారు కూడా వస్తుంటారు. ఈక్రమాన వారి అవసరాన్ని కొందరు ఉద్యోగులు ఆసరాగా మలుచుకుంటున్నారు. శిబిరంలో పరీక్షల తర్వాత సంబంధిత వ్యక్తి దరఖాస్తులో వైకల్య శాతం రాస్తారు. అర్హత లేని వారికి తక్కువ శాతం వేస్తుండగా, వీరికి కొందరు ఉద్యోగులు ఫోన్ చేసి సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మహిళా ప్రాంగణం మేనేజర్ విజేతతో విచారణ చేయించగా ఆమె నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు.
వసూళ్లు రూ.2కోట్లు ?
కొందరు ఉద్యోగులు వైద్యులు నమోదు చేసిన శాతాన్ని పెంచి పలువురికి సదరమ్ సర్టిఫికెట్లు జారీ చేశారని.. తద్వారా రూ.2 కోట్ల మేర వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈమేరకు నివేదిక ఆధారంగా సదరమ్ విభాగం ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్ అసిస్టెంట్ విష్ణును సస్పెండ్ చేయగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కాగా, సదరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అక్రమంగా సదరమ్ సర్టిఫికెట్ సాధించి ఉద్యోగంలో చేరినట్లు తేలింది. ఆయన అనారోగ్య సమస్యలు నిజమే అయినా రెండు కాళ్లు, రెండు చేతులు లేనట్లుగా సర్టిఫికెట్ తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో సర్టిఫికెట్ జారీ చేసిన ఆర్ధోపెడిక్ వైద్యుడు లక్ష్మణ్‌కే కాక అప్పటి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓ రాంబాబుకు సైతం నోటీసులు జారీ చేశారు. వైద్యుడు పరీక్షించాక డబ్బులు దండుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు కొందరి దరఖాస్తులపై వైకల్య శాతం పెంచి నమోదు చేశాక ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్ వద్దకు పంపించేవారని, వారు పూర్తిగా పరిశీలించకుండా సంతకాలు చేసినట్లు తేలడంతో అధికారులకు సైతం కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరిపైనా గతంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం, ఇప్పుడు ఇద్దరిపై వేటు వేయడం, అధికారులకు నోటీసులు జారీ కావడం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


