పారదర్శకంగా పరిష్కారం
● దరఖాస్తు తిరస్కరిస్తే సరైన కారణం తప్పనిసరి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రతీ వారం గ్రీవెన్స్ డేలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారం పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఎవరివైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు సహేతుక కారణాలు చెప్పాలని తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రుల నుంచి ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులు, సీఎం ప్రజావాణికి సంబంధించి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. దినపత్రికల్లో లో వ్యతిరేక వార్తలు వస్తే సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రజావాణికి సంబంధించి 201 పెండింగ్ దరఖాస్తులను వచ్చే శనివారంలోగా పరిష్కరించాలన్నారు. అధికారులు, సిబ్బంది హాజరు వివరాలను సమర్పించాలని సూచించారు. అనంతరం ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు, ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలన, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్’ కార్యక్రమ అమలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ ఎన్.సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇంకా ఎక్కడైనా కేంద్రాలు అవసరమైతే వెంటనే తెరిచి పంట కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, మిల్లులకు రవాణా, బిల్లుల కోసం ఆన్‌లైన్‌లో నమోదుపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు సన్యాసయ్య, చందన్‌కుమార్, శ్రీలత, గంగాధర్, పుల్లయ్య, ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు.
● ఖమ్మంవ్యవసాయం: ఆయిల్ పామ్ సాగుతో ఉన్న లాభాలను రైతుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఉద్యాన, సహకార శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో సోమవారం సహకార సంఘాల డైరెక్టర్లకు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సంప్రదాయ పంటల సాగుతో ఎదురవుతున్న కష్టనష్టాలను వివరిస్తే రైతులు వైవిధ్య పంటల వైపు దృష్టి మళ్లిస్తారని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు వైరా నియోజకవర్గంలో రైతులు ముందుకు వస్తున్నారని, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో కొంత వెనుకబాటు ఉంని చెప్పారు. జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, డీసీఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


