ఖమ్మంగాంధీచౌక్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని శ్రీ గుంటు మల్లన్న ఆలయంలో ఆదివారం స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం సహస్ర నామార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు జరిపించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతులు వెలిగించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు పర్యవేక్షణలో అర్చకులు దాములూరి వీరభద్రశర్మ, దాములూరి కృష్ణశర్మ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలు నిర్వహించారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి ఆదివారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, కార్తీక మాసం.. వారాంతపు సెలవులు కావడంతో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు.
ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతం
కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అర్చకులు, వ్రత మహత్యాన్ని, భద్రగిరిలో వ్రత కల్ప న విశిష్టతను వివరించారు.
వాలీబాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వార్యంలో ఆదివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ జట్లను ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి బి.గోవిందరెడ్డి తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియలో సంఘం బాధ్యులు నాగేంద్రకుమార్, రాజు రత్నాకర్, సీహెచ్.సుధాకర్‌రెడ్డి, సువర్ణబాబు, భద్రయ్య, ఉస్మాన్, వపన్, నెహ్రూ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి సీతక్క రాక
పినపాక: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం మండలంలో పర్యటించనున్నారు. బయ్యారం జెడ్పీఎస్‌ఎస్ హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు సోమవారం ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఆదివారం వివరాలు వెల్లడించారు.
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చా రు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. తలనీలాలు, ఒడి బియ్యం, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం చేశారు. ఈఓ ఎన్ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సహస్ర జ్యోతిర్లింగార్చన
వైభవంగా సహస్ర జ్యోతిర్లింగార్చన


