ఏజెంట్లను నష్టపర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
● ఎల్‌ఐసీ ఏఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ ● ముగిసిన మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్ : ఎల్‌ఐసీని కార్పొరేట్ల పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా ఏజెంట్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారని, దీంతో ఏజెంట్లను నష్టపరచడమే లక్ష్యంగా కేంద్రం కుట్ర పన్నుతోందని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి పి.జి.దిలీప్ విమర్శించారు. ఖమ్మంలో రెండు రోజుల పాటు జరిగిన ఏఓఐ సౌత్ సెంట్రల్ జోనల్ 6వ మహాసభలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల పొదుపు విధానానికి ఎల్‌ఐసీ ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. అలాంటి సంస్థను కొందరు కార్పొరేట్ సంస్థల కోసం ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఐఆర్‌డీఏఐని అడ్డుపెట్టుకుని ఏజెంట్లకు నష్టం కలిగించే పనులు చేస్తోందన్నారు. ఏజెంట్ల కమీషన్ తగ్గింపు, బీమా సుగం పోర్టల్ ప్రతిపాదన, పాలసీ పోర్టబిలిటీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీల వలె కమీషన్ విధానం ఉండాలనే ప్రతిపాదన వంటివి ఇందులో భాగమేనని విమర్శించారు. ఇలాంటి పరీక్షా సమయంలో ఏజెంట్లు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న యూనియన్ సభ్యత్వాన్ని మూడు రెట్లు పెంచుకోవాలన్నారు. ఎల్‌ఐసీ ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను పాలసీదారులకు వివరించాలని కోరారు. సభలో యూనియన్ ఆలిండియా అధ్యక్షుడు సురజిత్ కుమార్ బోస్, జోనల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.మంజునాథ్, పీఎల్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి శ్రీనివాసరావు, తన్నీరు కుమార్, నవీన్ పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభల ముగింపు సందర్భంగా ఎల్‌ఐసీ ఏఓఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.జ యరామ, ప్రధాన కార్యదర్శిగా పి.ఎల్.నరసింహరావు ఏకగ్రీవంగాతో పాటు మూడు రాష్ట్రాల నుంచి 141 మందితో నూతన కౌన్సిల్‌ను, 69 మందితో కమిటీని, 27 మంది ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. కోశాధికారిగా వలీ మొహిద్దీన్, ఉపాధ్యక్షులుగా టి.కోటేశ్వరరావు, డి.సి.శివమూర్తి, తాళ్లూరి శ్రీనివా సరావు, టి.నాగరత్నమ్మ, జి.శ్రీనివాస్, కె.రామనర్సయ్య, ఎం.నాగరాజు, ఆర్.శివ రుద్రమ్మ, ఎస్.లింగ వాడియా, ఎ.ఎస్.లోకేష్ షెట్టర్, కార్యదర్శులుగా కె.కృష్ణారెడ్డి, జి.రవి కిషోర్, సి.ప్రదీప్, తన్నీరు కుమార్, ఎన్.ఆర్.ఠాగూర్, జి.జి.సవిత, ఎం.అరుణ, జి.ఉదయలక్ష్మి, బి.వెంకట్రావు ఎన్నికయ్యారు.
ఏజెంట్లను నష్టపర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం


