తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్ట స్థానం
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు సాహితీరంగంలో కవిత్వానికి, కథలకు విశిష్ట స్థానం ఉందని పలువురు సాహితీవేత్తలు అన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఈస్తటిక్స్ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్, ప్రతిమ, వేంపల్లి షరీఫ్, వెల్దండి శ్రీధర్ మట్లాడుతూ.. సాహిత్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈస్తటిక్స్ సాహితీ సంరంభం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సంస్థ అధ్యక్షుడు రవిమారుత్ మాట్లాడుతూ.. సాహిత్య పోటీలకు కథలను, కవిత్వ సంపుటాలను ఆహ్వానించగానే స్పందించిన కవులకు కృతజ్ఞతలు తెలిపారు. 90కి పైగా కవితా సంపుటులు, 140కి పైగా కథలు రాగా కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోలోపలేదో కదులుతున్నుట్టు’ రూ. 40 వేల బహుమతి, రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ కవిత ‘గచ్చేం చెట్టుకు అటూ ఇటూ’ ప్రత్యేక ప్రశంసా ప్రోత్సాహక అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ కథగా వీఆర్ రాసాని ‘తేనెకల్లు’ రూ. 25 వేలు గెలుచుకోగా, ద్వితీయ ఉత్తమ కథగా ఆలూరి కిరణ్‌కుమార్ ‘అంజమ్మ’ రూ.15 వేలు గెలుచుకున్నాయి. తృతీయ ఉత్తమ కథగా యాములపల్లి నర్సిరెడ్డి రూ.10 వేల బహుమతి గెలుచుకున్నారు. అనంతరం ‘అసూయ’ కథల సంకలనంతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు, కమిటీ సభ్యులు ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణ, మువ్వా శ్రీనివాస రావు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫణిమాధవి కన్నోజుల పాల్గొన్నారు.
ఈస్తటిక్స్ పురస్కారాల సభలో
సాహితీవేత్తలు


