కౌలు రైతులపై కనికరమేది? | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులపై కనికరమేది?

Nov 10 2025 8:36 AM | Updated on Nov 10 2025 8:36 AM

కౌలు

కౌలు రైతులపై కనికరమేది?

● పత్తి అమ్మకంలో అన్నీ అవాంతరాలే.. ● ప్రత్యేక సైట్‌ ఏర్పాటు చేసినా అమలులో జాప్యం ● భూభారతిలో నమోదు కాకున్నా, ఫోన్‌ నంబర్‌ మారినా తప్పని ఇక్కట్లు

స్లాట్‌ బుక్‌ కావడం లేదు

సీసీఐలో విక్రయించలేకపోతున్నాం..

● పత్తి అమ్మకంలో అన్నీ అవాంతరాలే.. ● ప్రత్యేక సైట్‌ ఏర్పాటు చేసినా అమలులో జాప్యం ● భూభారతిలో నమోదు కాకున్నా, ఫోన్‌ నంబర్‌ మారినా తప్పని ఇక్కట్లు

ఖమ్మంవ్యవసాయం: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులకు పంట అమ్మకానికి అవకాశం కల్పించటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల సాగులో పట్టాదారుల(భూ యజమానులు) కన్నా కౌలుదారుల పాత్ర కీలకంగా ఉంది. రైతుల నుంచి ప్రాంతాన్ని, నీటివనరులు, నేలల రకాలను బట్టి ఎకరాకు ఏడాదికి రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు కౌలు చెల్లిస్తున్న పలువురు.. ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తున్నారు. అయితే పంటల విక్రయాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్మాలంటే ప్రభుత్వం షరతులు విధించింది. పట్టాదారు పాస్‌ బుక్‌ ఆధారంగా పండించిన పంటలనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునే అవకాశం ఉండగా కౌలు రైతులు అది కోల్పోతున్నారు. గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ విధానంలో కౌలు రైతులకు పంట విక్రయాలకు అవకాశం కల్పించారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో ఈ ఏడాది కౌలు రైతులకు పత్తి విక్రయానికి ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నోచడం లేదు. దీంతో పాటు నాన్‌ డిజిటల్‌ విధానంలో పంటలు నమోదైన వారు, ఫోన్‌ నంబర్లు మారిన రైతులు కూడా పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించలేక ఇబ్బంది పడుతున్నారు.

యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లేదు..

పత్తి అమ్మకానికి కౌలు రైతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా సైట్‌ కేటాయించింది. ఈ సైట్‌ అమలుకు యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌లను ఏఈఓలకు కేటాయించలేదు. దీంతో సీసీఐ రూపొందించిన కపాస్‌ కిసాన్‌ యాప్‌లో కౌలు రైతులకు స్లాట్‌ బుక్‌ కాకపోవడంతో వారు ఏఈఓల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ సైట్‌ను ఏ శాఖ ద్వారా అమలు చేస్తోందనేది స్పష్టత లేదు. గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లను మాత్రం మార్కెటింగ్‌ శాఖ ద్వారా అమలు చేసింది. ప్రస్తుతం రూపొందించిన నూతన సైట్‌కు యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌లు కల్పించకపోవడంతో ఏఈఓలు చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనే లక్ష మంది కౌలు రైతులు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకానికి అవకాశం లభించ లేదు. ఇక నాన్‌ డిజిటల్‌ విధానంలో పంట నమోదైన రైతులదీ ఇదే పరిస్థితి. పత్తి విక్రయానికి కపాస్‌ కిసాన్‌ యాప్‌ ఓపెన్‌ కాక ఆయా రైతులు సీసీఐలో పత్తి అమ్మలేకపోతున్నారు.

భూభారతిలో లేకపోయినా అంతే..

ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో భూ వివరాలు నమోదు కానివారికి కూడా సీసీఐలో పంట విక్రయానికి అనుమతులు లేవు. ఈ విధానంలో కూడా రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రతి గ్రామంలో 50 మందికి పైగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఫోన్‌ నంబర్లు మారితే ఖతమే..

ప్రభుత్వం వద్ద డేటాలో ఉన్న రైతు ఫోన్‌ నంబర్‌ మారినా పత్తి విక్రయానికి అవకాశం చేజారుతుంది. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో నమోదు చేసే ఫోన్‌ నంబర్‌, డేటాలో ఉన్న ఫోన్‌ నంబర్‌కు తేడా ఉంటే స్లాట్‌ బుకింగ్‌ను తిరస్కరిస్తుంది. తిరిగి నమోదుకు అవకాశం ఉన్నా.. రోజుల తరబడి సమయం పడుతోంది. దీని కోసం రైతులు ఏఈఓల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇలా పత్తి విక్రయాల్లో అడుగడుగునా రైతులు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.

మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. ప్రైవేటు మార్కెట్‌లో పత్తికి ధర లభించడం లేదు. సీసీఐలో విక్రయానికి స్లాట్‌ బుక్‌ కోసం ప్రయత్నం చేశా. ఏఈఓ సైట్‌ ఓపెన్‌ కావడం లేదన్నారు. వారం రోజులు ప్రయత్నించినా ఫలితం లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చి క్వింటా రూ.6వేల చొప్పున విక్రయించా.

– బాదావత్‌ కృష్ణమూర్తి, రాజుతండా,

మహబూబాబాద్‌ జిల్లా

కౌలు రైతుకు కేటాయించిన సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో సీసీఐలో పత్తి విక్రయించలేకపోతున్నాం. 20 రోజులుగా ఏఈఓ చుట్టూ తిరుగుతున్నా. 8 ఎకరాల్లో పత్తి సాగు చేశా. వ్యాపారులు రూ. 6,500కు మించి ధర పెట్టడం లేదు. సీసీఐ కేంద్రంలో పంట విక్రయానికి అవరోధాలు ఉన్నాయి. తగిన తేమశాతంతో పంటను సిద్ధం చేశాం. సీసీఐ అవకాశం కల్పిస్తే విక్రయించుకుంటాం.

– దారగాని బాబు, గంధసిరి, ముదిగొండ మండలం

కౌలు రైతులపై కనికరమేది?1
1/2

కౌలు రైతులపై కనికరమేది?

కౌలు రైతులపై కనికరమేది?2
2/2

కౌలు రైతులపై కనికరమేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement