
పాత స్టాక్‌కు కొత్త ధర!
● అమల్లోకి పెరిగిన మద్యం ధరలు ● ఇదే అదునుగా పాత స్టాక్‌కూ పెంచిన వ్యాపారులు
వైరా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, వైన్స్, బార్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న మద్యాన్ని నిబంధనల ప్రకారం పాత ధరలకే అమ్మాలి. కానీ అధికారులెవరూ ఈ దిశగా దృష్టి సారించకపోవడంతో పాత స్టాక్‌ను సైతం వ్యాపారులు కొత్త ధరతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ఇదే తంతు కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచడంతో మద్యం వ్యాపారులకు కాసులు పంట పండినట్లయింది. క్వార్టర్‌పై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.40 మేర ధర పెంచగా, ఆ ప్రకారమే పాత స్టాక్‌ను సైతం విక్రయించారు. ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని ఐఎంఎల్ డిపోలోనే సుమారు లక్ష కేసుల మద్యం పాత స్టాక్ ఉందని అధికారులే చెబుతున్నారు.
కొన్నింటికి మినహాయింపు
ప్రభుత్వం మద్యం ధరలు పెంచినప్పటికీ చీప్ లిక్కర్ జాబితాలో ఉన్న కొన్నింటిని మినహాయించింది. డైమండ్ విస్కీ, కేకే, డౌన్‌డౌన్, గుడ్‌వన్, డెక్కన్‌బ్లూ, యునైటెడ్ గోల్డు, బీకే, సన్‌హార్ట్స్, మెగాసిటీ బ్రాండ్ల మద్యానికి పాత ధరలే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బ్రీజర్ కంపెనీలో కాన్‌బెర్రీ ధరలోనూ మార్పు చేయలేదు. బ్రాండెడ్ మద్యం ధరలే పెంచడంతో ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో 17వ తేదీ వరకు రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది రూ.95 కోట్ల మద్యమే అమ్ముడైంది. మరో పది రోజుల్లో గత ఏడాది కంటే ఎక్కువ అమ్మకాలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఆలస్యంగా అమ్మకాలు
ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం అమల్లోకి రాగా వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మధ్యాహ్నం వరకు లారీలు బయటకు కదల్లేదు. కొత్త ధరలతో బిల్లింగ్ చేసేలా స్టాఫ్‌వేర్‌లో మార్పులు చేయడంతో ఆలస్యమైందని తెలిసింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత డిపోలో అమ్మకాలు మొదలుకాగా, ఒకేరోజు రూ.12 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారని సమాచారం.
మందుబాబులకు ముందే కిక్కు
పాల్వంచరూరల్: మద్యంపై పెంచిన ధరలు అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని భావించిన మందుబాబులకు ఆ ఆనందం దక్కలేదు. పాల్వంచ మండలం పెద్దమ్మగుడి ఆలయం సమీపంలోని వైన్స్‌లో పాత స్టాక్‌నే కొత్త ధరకు అమ్మడంతో వాగ్వాదం జరిగింది. ఈ విషయమై పలువురు ఎకై ్సజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ బ్రాండ్ మద్యం క్వార్టర్ ధర రూ.180 ఉంటే పెరిగిన ధరతో కలిపి రూ.190కు, హాఫ్, పుల్ బాటిళ్లు కూడా అలాగే అమ్మారని తెలిసింది. ఈవిషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్‌గౌడ్‌ను వివరణ కోరగా షాపుల్లో ఉన్న పాత స్టాక్‌ను ధర పెంచి అమ్మితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.