
జల రవాణాపై దృష్టి!
గతంలో రాజమండ్రి, భద్రాచలం మీదుగా..
కాకినాడ పోర్టు నుంచి బొగ్గును రైలు మార్గంలో తెలంగాణకు తీసుకొస్తుండగా తెలంగాణ బియ్యాన్ని రోడ్డు మార్గంలో భద్రాద్రి జిల్లా మీదుగానే కాకినాడకు తరలిస్తున్నారు. గోదావరిలో జలరవాణా అందుబాటులోకి వస్తే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు సరుకు రవాణాకు అవకాశం ఉంది. గతంలో కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం – చర్ల – కాళేశ్వరం (సిరోంచ, మహారాష్ట్ర)ల మధ్య బ్రిటీష్ / నిజాం జమానాలో జల రవాణా నిర్విరామంగా జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడంతో క్రమంగా జలరవాణా కనుమరుగైంది.
బరాజ్‌ల అండతో
గోదావరిలో ఏడాది పొడవునా ఏపీలోని వీఆర్‌పురం మండలం పోచవరం నుంచి రాజమండ్రి వరకు పడవలు తిరిగేంత నీటి మట్టం ఉంటుంది. ఈ స్ట్రెచ్‌లో పర్యాటకప్రాంతమైన పాపికొండలకు బోట్లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయి తే, రాజమండ్రి–భద్రాచలం–దుమ్ముగూడెం ఆనకట్ట వరకు జల రవాణాకు అనుకూలమైన నీటిమట్టం ఉండే అవకాశముంది. ఆ పైన సీతమ్మ సాగర్ (నిర్మాణంలో ఉంది), సమ్మక్క సాగర్ బరాజ్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్‌లు ఉన్నాయి. వీటికిపైన మంచిర్యా ల–గోదావరిఖని వంటి పారిశ్రామిక ప్రాంతాల నడుమ శ్రీపాదసాగర్ బరాజ్ ఉంది. దీంతో జలరవాణాకు కావాల్సినంత నీటి మట్టం గోదావరిలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వాటర్ వేస్
జలరవాణా అభివృద్ధిపై కేంద్రం నుంచి గతంలో అనేక ప్రకటనలు వచ్చాయి. 2008లో యూపీఏ హయాంలో నేషనల్ వాటర్ వేస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో వాటర్ వేస్–4లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు 171కి.మీ జల రవా ణా మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రోడ్, రైల్, రివర్(ఆర్‌ఆర్‌ఆర్) ట్రాన్స్‌పోర్ట్ పేరుతో ఇదే పథకానికి కొత్తరూపు ఇచ్చింది. ఇందులో మహారాష్ట్రలో నాసిక్ నుంచి బంగాళాఖా తం వరకు గోదావరిలో జలరవాణాకు గల అవకాశాలు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేర కు వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీస్ సర్వీసెస్ (వాప్కోస్) ఆధ్వర్యంలో పలుమార్లు సర్వేలు కూడా జరిగాయి.
ప్రతికూలతలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌ల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సీతమ్మసాగర్ బరాజ్‌కు ఇంకా అనుమతులు రాలేదు. వీటిపై స్పష్టత వచ్చాకే జల రవాణాపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. లేదంటే యూపీఏ, ఎన్డీఏ సర్కార్ల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు, సర్వేలతో సరిపెట్టే అవకాశముంది. ఒక వేళ ఎగువ ప్రాంతాలను మినహాయించి కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం వరకే జలరవాణాకు గల అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమేరకు అడుగులు ముందుకు పడే అవకాశముంది. అయినా భద్రాచలంలో స్థల లభ్యతతోపాటు భద్రాచలం – మల్కన్‌గిరి రైల్వేలైనులో పాండురంగాపురం – సారపాక సెక్షన్ల మధ్య రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మించాల్సి ఉంటుంది. గోదావరిలో జలరవాణా మొదలైతే తెలంగాణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత కీలకంగా మారే అవకాశముంది. స్థానికులకు వ్యాపార, ఉపాధి రంగాల్లో అవకాశాలు మరింతగా మెరుగవుతాయి.
చవక రవాణా
రోడ్డు, రైలు మార్గాలతో పోల్చితే జలరవాణా చవక. అందువల్లే సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతుంటాయి. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం లోటుగా ఉంది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత డ్రైపోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఆశించిన పురోగతి రాలేదు. దీంతో జలరవాణాకు గల అవకాశాలను పరిశీలించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇతర దేశాల నుంచి చౌకగా లభించే బొగ్గును కాకినాడ నుంచి తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం, తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కృష్ణా నదిలో జలరవాణా అందుబాటులోకి వస్తే దాని తీర ప్రాంతంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు మేలు జరుగుతుందనే అంచనాలున్నాయి.
గోదావరి నదిలో జల రవాణాకు గల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో ఉపాధి, వాణిజ్య రంగాలు మెరుగుపడే అవకాశం ఉంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
జలమార్గంపై అధ్యయనం
చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటన
గతంలో గోదావరిలో రాజమండ్రి–
భద్రాచలం– సిరోంచల మధ్య రవాణా
కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనూ రాజమండ్రి–భద్రాచలం స్ట్రెచ్