
ఇద్దరు ఆపరేటర్లపై వేటు..
శిక్షణకు ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరి
● కేఎంసీలో డిజిటల్ కీ దుర్వినియోగంతో చర్యలు ● రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు
నేలకొండపల్లి/ముదిగొండ: ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ స్పష్టం చేశారు. నేలకొండపల్లి, ముదిగొండ మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన శిక్షణణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఉపాధ్యాయులు కచ్చితంగా రావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందేలా జిల్లాలో 2,500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పా రు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచేలా బోధిస్తూ, బడిబాటలో ఎక్కువ మందిని చేర్పించేందుకు కృషి చేయాలని డీఈఓ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు. కాగా, పాఠశాల ప్రారంభం రోజే నోట్ బుక్స్, టెక్స్ బుక్స్, యూనిఫాం అందించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఈకార్యక్రమాల్లో ఎంఈఓలు బి.చలపతిరావు, రమణయ్యతో పాటు ఇటిక్యాల సురేష్, టి.వెంగళరావు, టి.గురవయ్య, కె.గోవిందరావు, మేరే వీరబాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థలో కీలక విభాగమైన రెవెన్యూ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ల అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల అందిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యాన విచారణ అనంతరం ఇద్దరు కంప్యూటర్ అపరేటర్లను అధికారులు తొలగించినట్లు తెలిసింది. ఇంటి నంబర్ల కేటాయింపులో అధికారులు తిరస్కరించిన ఫైళ్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు జారీ చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ విభాగం అధికారులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లపై అనేక ఆరోపణలు ఉన్నా ఇన్నాళ్లు చర్యలు తీసుకోలేదు. ఎట్టకేలకు అధికారులు కొరడా ఝుళిపిస్తూనే, రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
పలు అక్రమాలు గుర్తింపు
రెవెన్యూ విభాగం అధికారులు, ఆపరేటర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యాన అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా కొన్ని రోజులుగా విచారణ చేశారు. ఇంటి నంబర్ల కేటాయింపు, వీఎల్‌టీ ట్యాక్సులు, కోర్టు కేసులో ఉన్న ఫైళ్లకు మ్యుటేషన్లు చేయడం తదితర అక్రమాలు నిజమేనని తేలడమే కాక డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆపరేటర్లు సందీప్, సునీతను సర్వీస్ తొలగించేలా అసిస్టెంట్ కమిషన్ సిపారసు చేశారు. అనంతరం మదర్ థెరిస్సా కంప్యూటర్ ఆపరేటర్ల గ్రూప్ లీడర్లు, సభ్యులు మంగళవారం తీర్మానం చేసి సమర్పించడంతో వీరిద్దరిని తొలగించారు.
షోకాజ్ నోటీసులు
డిజిటల్ కీలు దుర్వినియోగం, విభాగంలో అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా ఉండడంపై కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఆర్‌ఐలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అంతేకాక అక్రమాలపై మరింత లోతుగా విచారణ జరిపించడమే కాక డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ
ఆర్‌ఓ రిలీవ్
ఇటీవల మహబూబాబాద్‌కు డిప్యూటేషన్‌పై బదిలీ అయిన ఆర్‌ఓ జి.శ్రీనివాసరావును కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య రిలీవ్ చేశారు. ఆర్‌ఓ డిప్యూటేషన్‌ను రద్దు చేయించి ఇక్కడే కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ ఆయనను రిలీవ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయాన మేనేజర్ బుచ్చిబాబుకు ఇన్‌చార్జి ఆర్‌ఓగా బాధ్యతలు కేటాయించారు.