
‘పది’లో అంతా ఉత్తీర్ణులయ్యేలా...
నేలకొండపల్లి: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జూన్ 3వ తేదీ నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో వీరంతా ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఫెయిల్ అయిన 1,048 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా పర్యవేక్షించడంతో పాటు ఒక్క విద్యార్థి ఉన్నా కూడా సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు.
ఒకరు ఉన్నా తప్పనిసరి
విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సెస్సీ చదివి ఫెయిల్ అయిన 1,048 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 352 మంది పరీక్షలు రాయగా, 35 మంది ఫెయిల్ అయ్యారు. వీరి కోసం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చెన్నారం, నేలకొండపల్లి, అప్పలనరసింహాపురం పాఠశాలల్లో ఒక్కొక్కరే ఫెయిల్ అయినప్పటికీ వారి కోసం తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. అయితే, కొన్ని చోట్ల మొక్కుబడిగా బోధిస్తున్నారని, అలాకాకుండా శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
జిల్లాలో 1,048 మందికి బోధన