
సర్వే సమస్యకు చెక్ పెట్టేలా..
● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు ● భూభారతి చట్టం అమలుతో పెరగనున్న అవసరాలు ● లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా గుర్తింపుతో యవతకు ఉపాధి ● ఉమ్మడి జిల్లాలో 1,073 మంది నుంచి దరఖాస్తులు
చుంచుపల్లి: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేసింది. ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్‌ను పొందుపర్చింది. ఈ నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనుండగా, శిక్షణ ఇచ్చి లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 17 వరకు మీ సేవా కేంద్రాల దరఖాస్తులు స్వీకరించగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 647 దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 426 మంది దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భూ సర్వేపై శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా గుర్తించనున్నారు. వీరు భూమి రిజిస్ట్రేషన్‌కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ సర్వేయర్లు పూర్తిస్థాయిలో పరిశీలించాక సంబంధిత జిల్లా అధికారి ఆమోదముద్ర వేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 44 మండలాల్లో ప్రస్తుతం 37 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల భూముల సర్వేకు నెలల తరబడి రైతులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఏర్పాటు చేయనుండటంతో సర్వేల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుంది.
50 రోజులపాటు శిక్షణ
దరఖాస్తులను పరిశీలించాక అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
26 నుంచి శిక్షణ..
లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 50 రోజులపాటు మూడు దశల్లో అవగాహన కల్పిస్తాం.
– శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్,
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్
ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు
కేటగిరీ ఖమ్మం భద్రాద్రి మొత్తం
ఓసీ 26 05 31
బీసీ 232 69 301
ఎస్సీ 182 73 255
ఎస్టీ 207 279 486
మొత్తం 647 426 1,073

సర్వే సమస్యకు చెక్ పెట్టేలా..