
దాడులకు పాల్పడడం హేయమైన చర్య
ఖమ్మం మామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజ యవంతం సందర్భంగా సైనికుల త్యాగాలు, కేంద్రప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంటే విచ్ఛిన్నం చేసేలా కొందరు దాడులకు పాల్పడటం గర్హనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన జవాన్ల వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలపాల్సింది పోయి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని తెలి పారు. ఈమేరకు జాతీయవాదులపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో నాయకులు నున్నా రవికుమార్, ఈ.వీ.రమేష్, సన్నే ఉదయ్‌ప్రతాప్, అల్లిక అంజయ్య, నంబూరి రామలింగేశ్వరరావు, రవిరాథోడ్, బెనర్జీ, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మద్దతుగా నిలవాలి
ఎవరు కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా దేశ భద్రతకు మద్దతుగా నిలబడాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీలను దేశభక్తికి నిదర్శనంగా చూడాలని కోరారు. ఖమ్మంలో ర్యాలీ సందర్భంగా జరిగిన చిన్నపాటి ఘటనలను రాజకీయం చేయకుండా, బాధ్యతగా పరిశీలించి తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు.