
ఆటో ఢీకొట్టడంతో మహిళ మృతి
తల్లాడ: తల్లాడ–కొత్తగూడెం రోడ్డులో తల్లాడ మండలం నరసింహరావుపేట వద్ద మోటార్ సైకిల్‌పై వెళ్తున్న మహిళను వెనక నుంచి ఆటో ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందింది. మధిర మండలం జాలిముడికి చెందిన జీడిమెట్ల సత్యవతి(67) అదే గ్రామానికి చెందిన సంగెపు రాములు మోటార్ సైకిల్‌పై జులూరుపాడు మండలం కాకర్లలోని తన కుమార్తె ఇంటికి బుధవారం వెళ్తోంది. ఈశ్రీక్రమాన నరసింహరావుపేట వద్ద ఆటో వెనుక నుంచి ఢీకొట్టగా సత్యవతి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, రాములుకు గాయాలయ్యాయి. సత్యవతి కుమార్తె రాధ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతున్న మహిళ..
చింతకాని: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన కిలారి వెంకట్రావమ్మ(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యాన 19వ తేదీన పురుగుల మందు తాగిన ఆమె కాసేపటికి విషయాన్ని భర్త వెంకటేశ్వరరెడ్డికి చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఘటనపై ఆమె భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
రైలు నుంచి జారి పడిన వ్యక్తి..
ఖమ్మంక్రైం: కదులుతున్న రైలు నుంచి జారిపడడంతో గుర్తు తెలియని వ్యక్తి(25) మృతి చెందాడు. పాపటిపల్లి స్టేషన్ సమీపాన బుధవారం ఆయన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో మృతదేహన్ని మార్చురీకి తరలించగా, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
చికిత్స పొందుతున్న హోంగార్డు..
ఖమ్మంక్రైం: పురుగుల మందు తాగిన హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సత్తూరి అశోక్(37) ఖమ్మంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సారథినగర్ వెళ్లే మార్గంలోని వంతెన వద్ద పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి బంధువులు హైదరాబాద్‌కు తరతలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కాగా, అశోక్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.
గాయపడిన వ్యక్తి..
తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వేల్పుల చిన్నప్ప(60) కుటుంబంతో సహా ఖమ్మం సంభానీ నగర్‌లో నివసిస్తున్నాడు. నగరంలోని రంగనాయకుల వద్ద కొద్దిరోజుల క్రితం సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి చికిత్స చేయిస్తుండగా ఆయన బుధవారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు.