
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ముత్తగూడెంలో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం ఎంపీపీఎస్‌లో అదనపు తరగతిగదుల నిర్మాణానికి, పొన్నెకల్ నుండి పిట్టలవారిగూడెం వయా ఆరెంపుల రోడ్డుకు, కాచిరాజుగూడెంలో చింతపల్లి – కాచిరాజుగూడెం రోడ్డు మరమ్మత్తులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
జాబ్ మేళా స్థల పరిశీలన
వైరా: ఈనెల 24న వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సింగరేణి సంస్థ ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు కళాశాల మైదానాన్ని బుధవారం వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్ పరిశీలించారు. జాబ్‌మేళాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానుండగా, పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనే అవకాశమున్నందున పార్కింగ్, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఐ సాగర్, ఎస్‌ఐ రామారావు, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు ఏదునూరి సీతారాములు పాల్గొన్నారు.
ఇకనైనా
నరమేథాన్ని ఆపాలి
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు
ఖమ్మంమయూరిసెంటర్: ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలు మావోయిస్టు పార్టీ నేతలు, గెరిల్లా దళ సభ్యులు 80 మందిని ఎన్‌కౌంటర్ చేశాయని.. ఇకనైనా ఈ నరమేథాన్ని ఆపాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో 500 మందిని హతమార్చగా, ఇందులో అమాయకులు, సాధారణ ఆదీవాసీలు కూడా ఉన్నారని తెలిపారు. దేశ పౌరులు, ప్రజల తరఫునర నిలబడే వారిపై అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా చేస్తోందని ఆరోపించారు. కాగా, ఎన్‌కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని న్యాయవిచారణ చేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
108 అంబులెన్స్‌లో ప్రసవం
మధిర: నిండు గర్భిణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే స్రసవించింది. మధిర మండలం మహాదేవపురానికి చెందిన పి.స్రవంతి(23)కి బుధవారం ఉద యం పురిటి నొప్పులు వస్తుండడంతో మధిర ఆస్పత్రికి తీసుకెళ్లగా ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 ద్వారా ఖమ్మం తీసుకెళ్తుండగా బోనకల్ సమీపాన నొప్పులు ఎక్కవవడంతో ఆశ వర్కర్ సాయంతో ఈఎంటీ రామయ్య ఆమెకు ప్రసవం చేశారు. ఈక్రమంలో స్రవంతి ఆడపిల్లకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలను మధిర ఆస్పత్రిలో చేర్చారు.
‘యంగ్ ఇండియా’
స్కూల్ స్థల పరిశీలన
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని చెన్నూరులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు సేకరించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను చెన్నూరులో నిర్మించేందుకు స్థలాన్ని గుర్తించారు. ఈ భూమిని కల్లూరు ఆర్డీఓ రాజేందర్‌గౌడ్ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ భూమికి ఇప్పటికే హద్దులు నిర్ధారించగా, మ్యాప్‌లను పరిశీలించి పూర్తి వివరాలు ఆరా తీశారు. తహసీల్దార్ పులి సాంబశివుడు, ఆర్‌ఐలు సుజాత, ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన