
ఆర్టిజన్లకు బదిలీల భయం
● కేటీపీఎస్‌లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు ● పర్మనెంట్ చేశాకే బదిలీ చేయాలని డిమాండ్
పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే టీజీ జెన్‌కో పరిధిలోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలతోపాటు, ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు బదిలీలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన వైటీపీఎస్, బీటీపీఎస్‌లలో ఉద్యోగ, కార్మికులు అవసరం ఉండటంతో అక్కడికే ఎక్కువ మందిని బదిలీలు చేశారు. ఈ క్రమంలో కేటీపీఎస్‌లో అదనంగా ఉన్న ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కలిగించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బదిలీలు సరికాదంటున్న కార్మికులు
ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్–1, 2 ,3, 4లుగా ఉన్నారు. స్కిల్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరు గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన క్రమంలో స్కిల్‌ను బట్టి ఆయా కంపెనీలు పనికి తగిన వేతనం ఇచ్చేవి. గత ప్రభుత్వం వీరిని ఆర్టిజన్‌లుగా తీసుకోవడం, కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశలో ఆర్టిజన్లు ఉన్నారు. కానీ పదేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల మాదిరిగా వీరికి జెన్‌కో యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలేదు. పైగా అదనంగా ఉన్నారనే నెపంతో యాజమాన్యం ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే యోచన సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఆర్టిజన్లు వాపోతున్నారు.
ఉద్యోగులుగా తీసుకోవాలి
ఇప్పటివరకు ఇతర కేడర్లలో అత్యధికంగా పదోన్నతులతోనే బదిలీలు చేపట్టారు. ఆర్టిజన్లు కేటీపీఎస్ 7వ దశలో 600 మంది, కేటీపీఎస్ 5,6 దశల్లో సుమారు 1,400 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి సుమారు 24 వేల మంది ఉన్నారు. బదిలీ చేసే ముందు తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగులకు కల్పి స్తున్న సౌకర్యాలన్నీ తమకు కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. లేనిపక్షంలో బదిలీ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.