
కర్ణాటకలో చోరీ.. వైరాలో రికవరీ
వైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్‌లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్‌నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్ల కిలే ఏఎస్‌ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్‌కుమార్‌కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు.
విద్యుదాఘాతంతో
చిన్నారి మృతి
ఖమ్మం సిద్ధార్థనగర్‌లో విషాదం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్‌లో విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. కొణిజర్ల మండలానికి చెందిన రాచుమళ్ల రాజు – మేరీ దంపతులు అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్ ప్రాంతంలోని ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె టి.జాస్మిన్(11) బుధవారం ఉదయం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు స్విచ్ బోర్డును తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తల్లి మేరీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, అంతసేపు కళ్ల ముందు ఆడుతూ తిరిగి కుమార్తె కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.