
రామా.. కనవేమిరా!
● అరకొర వసతులతో అంజన్న మాలధారుల ఇక్కట్లు ● తరలివచ్చిన భక్తులతో భద్రాచలంలో హనుమజ్జయంతి సందడి ● కనీస ఏర్పాట్లు చేయని ప్రభుత్వం.. దాతల స్పందన కూడా కరువే..
భద్రాచలం: మాల విరమించేందుకు భద్రగిరి వచ్చిన అంజన్న భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. హనుమాన్ మాలధారులు ఇక్కట్ల నడుమే గురువారం శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. హనుమజ్జయంతికి ప్రభుత్వం, దేవస్థానం ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ మాల ధరిస్తారు. అయ్యప్ప మాలధారణ తర్వాత హనుమాన్ మాలధారణకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. మాలధారులు కొండగట్టు అంజన్న వద్ద, భద్రాచలం శ్రీ సీతారాముల చెంతన ఇరుముడి విరమణ చేసేందుకు ఆసక్తి చూపుతారు. మూడు రోజుల్లో సుమారు 40 వేల మంది భక్తులు భద్రాచలాన్ని సందర్శిస్తారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతికే ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పవచ్చు. ఈసారి కూడా అధిక సంఖ్యలో అంజన్న మాలధారులు భద్రగిరి వచ్చారు. కానీ ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం ఆధ్వర్యంలో కేవలం అధికంగా లడ్డూల తయారీ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు తప్ప ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేయలేదు.
క్యూలైన్లు కిటకిట
తరలివచ్చిన హనుమాన్ మాలధారులతో భద్రగిరి కాషాయవర్ణంగా మారింది. రోడ్లన్నీ సందడిగా మారాయి. శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి వరకు, మళ్లీ గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ విరమణను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, తమలపాకులతో అర్చన, తదితర పూజలను గావించారు. ప్రసాదాల కోసం శాశ్వత ఆరుకౌంటర్లు, స్టేడియంలో బ్యాంకర్ల ద్వారా నాలుగు, పడమర మెట్ల వైపు మరో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈఓ రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.