ఎందుకింత నిర్లక్ష్యం?
ఎయిడ్స్, లెప్రసీ విభాగాలపై అధికారుల చిన్నచూపు
● సుదీర్ఘ కాలంగా కొరవడిన పర్యవేక్షణ ● 2019 నుంచి ‘అదనపు’ విధులు నామమాత్రమే ● స్పెషలిస్టులు లేక పెరుగుతున్న కేసులు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఈ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) విభాగం ఉంటుంది. ఆ పోస్టుకు డిప్లొమా ఇన్ డెర్మటో వెనెరియోలజీ అండ్ లెప్రసీ(డీడీవీఎల్) స్పెషల్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. అయితే చాలా ఏళ్లుగా ఈ పోస్టుపై నీలినీడలు అలముకున్నాయి. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా వైద్యాధికారి పోస్టులో పనిచేస్తున్న అధికారి దీర్ఘకాలంగా సెలవు పెట్టడంతో ఆ విభాగంపై పర్యవేక్షణ కొరవడుతోంది. 2019 నుంచి సదరు అధికారి డిప్యుటేషన్‌పై పొరుగు జిల్లాలో పనిచేయడం, ఆ తర్వాత వచ్చి మళ్లీ తన పోస్టులో జాయిన్ కావడం, ఆ తర్వాత తరచూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తుండడంతో ఆ విభాగాన్ని పట్టించుకునే వారు లేరు. కీలకమైన వ్యాధుల కట్టడికి అర్హులైన స్పెషలిస్ట్ వైద్యాధికారి లేకపోవడంతో కేసుల నియంత్రణ సాధ్యం కావడం లేదు.
ఎయిడ్స్ కేసులు ౖపైపెకి..
ఎయిడ్స్ అండ్ లెప్రసీ జిల్లా అదనపు వైద్యాధికారి సాధారణంగా ఎయిడ్స్ కేసులపై నిత్యం పర్యవేక్షించాలి. వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం కింది స్ధాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండాలి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కేసులు పెరగకుండా చూడాలి. కానీ జిల్లాలో గత కొన్నేళ్లుగా ఎయిడ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అవగాహన లేమితో యువత హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రతీ నెల 50 నుంచి 60 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే కాగా అనధికారికంగా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 17,350 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఏఆర్‌టీ సెంటర్ల ద్వారా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఎంతమంది వ్యాధి గ్రస్తులు ఉన్నారు, ఎంత మంది చనిపోయారు అనే సమగ్ర రికార్డులు లేకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఏఆర్‌టీ ద్వారా 6,842 మంది మందులు వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని ఏఆర్‌టీ సెంటర్లలో నిత్యం పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
సర్వే ద్వారానే
కుష్ఠు బాధితుల గుర్తింపు..
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) ఆధ్వర్యంలో నిరంతరం లెప్రసీ కాలనీల్లో పర్యటించాలి. ఎక్కడ అనుమానిత కేసులు ఉన్నాయో సిబ్బందితో కలిసి గుర్తించాలి. అయితే 2019 నుంచి ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రెండు వారాల పాటు సర్వే చేస్తుంది. ఆ సమయంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఎవరికై నా మచ్చలు ఉన్నాయా, అవి ఎలాంటివి అని పరీక్షిస్తారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తారు. ఆ సమయంలోనే తప్పితే ఆ తర్వాత కుష్ఠు వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో 2027 నాటికి కుష్ఠు రహిత దేశంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం
ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి సెలవులో ఉన్నది వాస్తవమే. అయినా ఆ రెండు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఓ అధికారికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించాం. అర్హత గల అధికారి ఉండాల్సి ఉన్నా, కొరతతో ఉన్న వారితోనే వ్యాధి నియంత్రణకు పాటుపడుతున్నాం. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా అధికారి పోస్టులో మరొకరిని శాశ్వతంగా నియమించాలంటే డీహెచ్ నిర్ణయం తీసుకోవాలి.
– బి.కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ
ఎందుకింత నిర్లక్ష్యం?


